పాఠశాలల పున:ప‌్రారంభంపై తమిళ సర్కార్ పునరాలోచన
చెన్నై: దేశంలో ఎక్కువ స్థాయిలో కరోనా బారిన పడిన రాష్ట్రాలలో తమిళనాడు ఒకటి. ఇప్పుడంటే పాజిటివ్ కేసుల సంఖ్యలో ఏపీ రెండో స్థానంలో కనిపిస్తుందిగానీ.. కరోనా ప్రబలిన తొలి మూడు, నాలుగు నెలల తమిళనాట భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువేమీ కాదు. రోజూ 3 నుంచి 4 వేల దాకా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. కేసుల పెరుగుదలను గమనించిన తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలు పున: ప్రారంభించే విషయంలో పునరాలోచనలో పడింది. ముందుగా నవంబర్ 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరవాలని భావించినా.. ప్రస్తుతం ఈ విషయంలో వెనక్కి తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయి. దానికి తోడు సెకెండ్ వేవ్ కరోనా వైరస్ విజృంభణ ముందుందన్న హెచ్చరికలు జారీ అవుతున్న తరుణంలో పాఠశాలలు తెరిచి, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం మంచిది కాదని ముఖ్యమంత్రి ఫళని స్వామి భావిస్తున్నట్లు తెలుస్తోంది.
(ప.గో జిల్లాలో 8 మంది విద్యార్థులకు కరోనా)
దానికి తోడు పొరుగునే వున్న ఏపీలో పాఠశాలలు తెరిచిన రెండ్రోజుల్లోనే మూడు జిల్లాల్లో వందల సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కరోనా బారిన పడిన వార్తలు కూడా తమిళ ప్రభుత్వాధినేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు. నవంబర్ 9వ తేదీ లోగా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలను తిరిగి తెరిచే విషయంలో అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలుపవచ్చని తమిళనాడు విద్యాశాఖ ప్రకటించింది.