ఇక ధరణి స్లాట్ రద్దు చేసుకోవచ్చు..

హైదరాబాద్: రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టని ధరణి పోర్టల్‌లో ప్రభుత్వం మరిన్ని ఆప్షన్లు జత చేసింది. రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రద్దు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దీంతోపాటు సెమీ అర్బన్ ల్యాండ్ పట్టాదార్ పాస్‌పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నవారికి ఊరట కల్పించింది. స్లాట్‌ను రద్దు చేసుకునేందుకు ధరణిలో ఇప్పటివరకు ఆప్షన్ లేదు. కేవలం స్లాట్ తేదీని మూడుసార్లు వాయిదా వేసుకునే ఆప్షన్ మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో ‘క్యాన్సలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్’ పేరుతో ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం స్లాట్‌ను రద్దు చేసుకుంటే చెల్లించిన స్టాంప్ డ్యూటీలో 90 శాతం తిరిగి చెల్లించనుంది.
నగరాల శివార్లలోని గ్రామాలు, మండలాలు వేగంగా పట్టణీకరణ చెందుతున్న నేపథ్యంలో భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా ఆయా ప్రాంతాలను ‘సెమీ అర్బన్ ల్యాండ్స్’గా గుర్తించారు. వాటిని వ్యవసాయేతర భూముల క్యాటగిరీలో చేర్చారు. వాటికి కొత్త పాస్‌పుస్తకాలు మంజూరు కాలేదు. ఇలాంటివారు పాస్‌పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ‘ఐప్లె ఫర్ పీపీబీ సెమీ అర్బన్ ల్యాండ్’ పేరుతో కొత్త ఆప్షన్ ఇచ్చింది. కానీ ఈ పాస్‌పుస్తకాలకు రైతుబంధు వర్తించదని అధికారులు తెలిపారు. వీటికితోడు వ్యవసాయ భూముల లీజులకు చట్టబద్ధత కల్పించేందుకు త్వరలో ‘అప్లికేషన్ ఫర్ లీజ్’ ఆప్షన్‌ను జోడించనున్నట్టు పేర్కొన్నారు.