ఎస్వీబీసీలో అశ్లీల వెబ్‌సైట్ లింక్ కలకలం

అమరావతి: తిరుమల దేవస్థానానికి చెందిన ఎస్వీబీసీ (శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్)లో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఎస్వీబీసీకి ఓ భక్తుడు మెయిల్ చేశాడు. ఆ భక్తుడికి ఎస్వీబీసీ ఉద్యోగి ఓ పోర్న్ సైట్ వీడియోను పంపాడు. దీంతో అవాక్కైన ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డిలకు ఫిర్యాదు చేశాడు. దీనిపై వారిద్దరు సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించారు.
ఎస్వీబీసీ చానల్‌లో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు పనివేళల్లో అశ్లీల వీడియోలు, పోర్న్ వెబ్‌సైట్లు చూస్తున్నట్లు వారి దృష్టికి వచ్చింది. భక్తుడికి పోర్న్‌వెబ్‌సైట్ లింక్ పంపిన ఉద్యోగిని గుర్తించారు. అతడితోపాటు అశ్లీల వీడియోలు చూస్తున్న మరికొందరిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ ఘటనపై ఏపీలోని విపక్ష టీడీపీ, బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. శ్రీవారి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారని ఆరోపించారు. ఆ సిబ్బందిని వెంటనే ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.