ఎస్. వి.రమణా చారి: సెహబాస్ నగర ఓటరు…

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని,ఆనందాన్ని,ఓటర్ల విజ్ఞతను చాటుతున్నాయి.రాజకీయ నేతల వ్యూహాలకు,, ఎత్తులకు పై ఎత్తులు వేసేదిగా ఉంది.ఓ సారి మనం ఫలితాలను పరిశీలిస్తే…టీఆర్ఎస్-55,బీజేపీ-48,ఎంఐఎం-44,కాంగ్రెస్-2 స్థానాలను పొందాయి….

ఇదే ఓటరు విజ్ఞత…

టీఆర్ఎస్ వందకు పైగా గెలుచు కుంటాం,బల్దియా ఓటరు మాకే పట్టం కట్టడం ఖాయం అనే ధీమాతో ప్రచార హోరును కొనసాగించింది….అలాగే బీజేపీ రాష్ర్ట చీఫ్ బండి సంజయ్ తన దైన స్టయిల్ లో …ఎంఐఎం నేతలు కూడా వాడి,వేడి పెంచేలా ప్రచారం సాగించగా….నగరఓటరు ఆలోచన రేకెత్తించే తీర్పునివ్వడం గ్రేట్…

ఏకపక్షంగా తీర్పునివ్వకుండా టీఆర్ఎస్ ను 55 దగ్గరే పరిమితం చేయడం..అటు ఎంఐఎం,బీజీపీ లకు 44,48దాటకుండా కట్టడి చేయటం గొప్పపరిణామం…

ఇక ఇప్పుడేం చేయాలి…

రాజకీయాలలో శాశ్వత మిత్రులు,శత్రువులు ఎవ్వరూ వుండరు.అవసరం కోసం,అధికార పీఠం కోసం ఒకరికొకరు సహకారం అందించు కోవటం సహజమేకదా…

సిద్ధాంతాలు,రాద్ధాంతాలు పక్కన పెట్టడం సహజమే…ముక్కున వేలు వేసుకొని ఆశ్ఛర్య పోవటం ఓటరన్నలకు సహజమే..అంటే రాజకీయంగా అంటరాని పార్టీలు ఉండవు. ఎన్నికల వరకే ప్రత్యర్థులు. ఎన్నికల తరువాత అందరూ అభివృద్ధి కార్యక్రమాల్లో,అధికారం కోసం పాలుపంచుకోవాల్సిందే. కేరళ, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ముస్లిం, క్రిస్టియన్ అని ప్రత్యేకంగా చెప్పకపోయినా కేవలం ఆయా వర్గాల ఓటర్లపై ఆధారపడిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రభుత్వ ఏర్పాటులో పాలుపంచుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాదానికి అనుకూలంగా ఉండే మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)తో కలిసి భారతీయ జనతా పార్టీ అధికారం పంచుకున్న విషయం మర్చిపోకూడదు. ఉత్తర ప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్, మాయావతి నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ, బహజన సమాజ్ వాదీ పార్టీ లతో బీజేపీ పొత్తు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి.

భాగ్యనగరం పాతబస్తీలో పాకిస్థాన్ ,బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు అక్రమంగా ఉంటున్నారని, వాళ్లకు మజ్లిస్ పార్టీ ఆశ్రయం కల్పించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు…రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ మద్దతు కారణంగానే మజ్లిస్ అలా చేయగలుగుతోందని బండి సంజయ్ బహిరంగంగా విమర్శించి ఎన్నికల ప్రచారంలో వేడి పెంచారు.రొహింగ్యాలపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామని బహిరంగ సభల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించారు. సర్జికల్ స్ట్రయిక్ చేయడం ఖాయమని గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వచ్చిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ కూడా ప్రచారంలో ఘంటా పధంగా చెప్పారు. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఫిర్యాదు చేస్తే చాలు అక్రమంగా తిష్ట వేసిన వారిని ఎలా ఏరివేస్తామో తెలుస్తుంది అని తనదైన శైలిలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మజ్లిస్ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుని రెండో అతిపెద్ద పార్టీ గా అవతరించిన బీజేపీ ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చుంటే రానున్న కాలంలో డీలా కాక తప్పదు.

అభివృద్ధి కోసమే ఓటరు తీర్పు..!?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి ప్రజలు ఏకపక్షంగా పట్టం కట్టలేదు. దీంతో భాగ్యనగరం అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలను తప్పనిసరిగా భాగస్వామ్యులను చేసేలా ఇచ్చిన ఓటర్ల తీర్పును స్వాగతించాలి. టీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ వీటిలో ఏ రెండు పార్టీలు అయినా కలిసి అధికారం చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండూ కలిసి భాగ్యనగరంలో పాలన చేస్తే అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదురుతుంది. పథకాల అమలులో పారదర్శకత, జవాబుదారీతనం ఉంటుంది. టీఆర్ఎస్-మజ్లిస్ పార్టీలు కలిసి అధికారం పంచుకుంటే రాజధాని సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదు అని రాజకీయ పరిశీలకుల అంచనా..మజ్లిస్ పార్టీ ఇష్టాలకు అనుగుణంగా టీఆర్ఎస్ వ్యవహరించాల్సి ఉంటుందనే అపవాదులు వస్తున్నాయి.

మరి బీజేపీ, మజ్లిస్..కలిస్తే…

ఈ రెండు పార్టీల భాగస్వామ్యంలో బల్దియా పగ్గాలు చేపడితే భాగ్యనగరం అభివృద్ధి పరుగులు పెడుతుంది ఇలా అంటే చాలా మంది నమ్మక పోవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ-పీడీపీ సంయుక్తంగా అధికారం పంచుకున్న సందర్భంగా కొన్ని షరతులు విధించుకున్నాయి. అందులో జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయాలనే ఎజెండాను బీజేపీ పక్కన పెట్టిన విషయం తెలిసిందే… అలాగే పాతబస్తీలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను గుర్తించి వెనక్కి పంపడం అనే ప్రధానమైన అంశాన్ని బీజేపీ తాత్కాలికంగా పక్కన పెట్టవచ్చు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ బీజేపీతో మాకు శతృత్వం ఏమీ లేదని స్పష్టంగా చెప్పడం గమనించాల్సిన విషయం.

కమలంపై…ప్రజల ఆశలు…

భారతీయ జనతా పార్టీ పై భాగ్యనగర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే నాలుగు స్థానాలు ఉన్న పార్టీ కి 48 స్థానాలు కట్టబెట్టారు. నగరం నలుమూలలా అంటే అన్ని ప్రాంతాల నుంచి బీజేపీ కి ప్రాతినిధ్యం లభించింది. అందువల్ల బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుందామనుకుంటే ప్రజల ఆశలను వమ్ము చేసినట్లే అవుతుంది. మజ్లిస్ పార్టీ హవా పాతబస్తీకి మాత్రమే పరిమితమైంది. టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉండబట్టే మూడోవంతు సిట్టింగ్ సీట్లను కోల్పోయింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గరి బంధువులు కూడా ఓడిపోయారంటే ఆ పార్టీని తిరస్కరించారనే అర్థం. ఈ నేపథ్యంలో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే టీఆర్ఎస్, మజ్లిస్ లలో ఒక పార్టీని ఎంచుకోక తప్పదు. టీఆర్ఎస్ తో జట్టు కలిస్తే రాజధాని అభివృద్ధి సాధ్యమే అయినా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలనే బీజేపీ ఆకాంక్షకు ఆటంకంగా మారే అవకాశం ఉంది. మజ్లిస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే రాజకీయంగా బీజేపీకి లాభం జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి…జీహెచ్ఎంసీ మేయర్ కుర్చీతో పాటు ముఖ్యమంత్రి కుర్చీ విషయంలో కూడా మజ్లిస్ నుంచి పోటీ ఉండదు. అసదుద్దీన్ ఓవైసీ వరకూ చూస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాతబస్తీని మిగతా నగరంతో దీటుగా అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. మెట్రో రైలు, రోడ్ల విస్తరణ, రవాణా సౌకర్యాల విస్తృతి, సూపర్ మాల్స్ ఏర్పాటు సాధ్యమవుతుంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడానికి తోడ్పడుతుంది. తద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించినట్లు పాతబస్తీ ప్రజలను ప్రధాన స్రవంతిలోకి తెచ్చేందుకు సాధ్యపడుతుంది.

-ఎస్. వి.రమణా చారి

(సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు -98498 87086)

Leave A Reply

Your email address will not be published.