ఏదీ సామాజిక దూరం
కామారెడ్డి: జాగ్రత్తలు పాటించండి… కరోనా బారీన పడకండని ప్రభుత్వాలు, నాయకులు, సెలబ్రిటీ, సామాజిక మాధ్యమాలు.. చివరకు మోబైల్ కాలర్‌ట్యూన్లు చెబుతూనే ఉన్నాయి. అయినా కానీ ప్రజలు ఏమాత్రం జాగ్రత్తలు పాటించడం లేదు. తీరు మారకపోతే మహమ్మారిని కొనితెచ్చుకోవాల్సిందే అని డాక్టర్లు, అధికారులు, పోలీసులు చెబుతున్నా వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. అసలే వారు కోవిడ్ బాధిత కుటుంబ సభ్యులు.. జాగ్రత్తలు పాటించాల్సిన వారే ఆ నిబంధనలు మరిచారు. కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించుకోవడానికి పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులు బారులు తీరారు. జిల్లా ఆస్పత్రిలో కోవిడ్ నిర్ధారణ పరీక్ష కోసం సుమారు వంద మంది వరకు ఆస్పత్రికి వచ్చారు. వాళ్ళ ఇంటి సభ్యులకో, లేకపోతే పక్కవాళ్లకు ప్రైమరీ కాంటాక్ట్ అయి ఉన్నారో తెలియదు కాని పరీక్షల కోసం వచ్చారు. వచ్చిన వారిలో కోవిడ్ పాజిటివ్ ఉన్నవారు కూడా ఉండవచ్చు. అలాంటి చోట దూరం పాటించాల్సింది పోయి అవేవి పట్టించుకోకుండా గుంపుగా ఒకచోట చేరారు. అలాగే జిల్లా ఆస్పత్రిలో ఓపి విభాగం వద్ద సాధారణ ప్రజలు కూడా భౌతిక దూరం పాటించలేదు. అక్కడ ఉన్న సెక్యురిటి దూరం ఉండాలని చెప్తున్నా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అసలే జిల్లా కేంద్రంలో వందలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇలా కనీస జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తే కరోనా మరింత విస్తరించే ప్రమాదం ఉంది. సామాజిక దూరం పాటించడంలో ప్రజల్లో కనీస మార్పు రాకపోవడం బాధాకరం.
విలయతాండవం చేస్తున్న కరోనా
కామారెడ్డి జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. జిల్లాలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన మూడు నెలల కాలంలో జిల్లాలో 2517 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సామాన్య ప్రజలతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసులు ఉన్నారు.
ప్రజల్లో మార్పు శూన్యం
జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నా ప్రజల్లో ఇంచు కూడా మార్పు రావడం లేదు. కరోనా వస్తే తమకేం అవుతుందనే భావన చాలా మందిలో ఉండిపోయింది. మహా అయితే 14 రోజులు ఇంట్లో నుంచి కదలకుండా ఉండాల్సి వస్తోంది. అంతేగా అని లైట్ తీసుకుంటున్నారు. ఈ నిర్లక్ష ధోరణే నేడు రెండున్నర వేల కరోనా కేసులు పెరగడానికి కారణమైంది. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు.
గతంలో భయం.. ప్రస్తుతం నిర్లక్ష్యం
గతంలో రాష్ట్రంలో 50 కరోనా కేసులు నమోదయితే ఈ రాష్ట్రం ఏమవుతుందోనని విపరీతమైన ఆందోళనకు గురయ్యే వారు. కానీ ప్రస్తుతం వారి ప్రాంతంలోనే పక్కనున్న వారి ఇంట్లోనే కరోనా వస్తున్నా ఆ భయం మాత్రం లేకుండా పోయింది. గతంలో ఈ ప్రభుత్వం మొండిగా పోతుంది అని నిందించేవారు. ప్రస్తుతం పరీక్షల సంఖ్య పెంచడంతో కేసుల తీవ్రత పెరుగుతోంది. కరోనాతో సహజీవనం తప్పదు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అని ప్రభుత్వం మొత్తుకుంటున్నా ప్రజలు నిర్లక్ష్య ధోరణి విడటం లేదు. ఫలితంగా కేసుల తీవ్రత పెరుగుతోంది. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్లపైకి జనాలు వచ్చినంత కాలం కరోనా తన ప్రతాపం చూపిస్తూనే ఉంటుంది.