ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలివిడత కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విజయవాడలో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెవెన్యూ డివిజన్ ప్రతిపాదికన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం నుంచి మిశ్రమ అనుభవాలు ఉన్నాయని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే 2019 జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు.
తొలి దశ ప్రక్రియ ఇలా..
మొదటి దశ ఎన్నికల ప్రక్రియ శనివారమే ప్రారంభమై ఫిబ్రవరి 5న సర్పంచి, ఉపసర్పంచి ఎన్నికతో ముగుస్తుంది.
జనవరి 23 : నోటిఫికేషన్ జారీ
- 25 – అభ్యర్థులనుంచి నామినేషన్ల స్వీకరణ
- 27 – నామినేషన్ల దాఖలుకు తుది గడువు
- 28 – నామినేషన్ల పరిశీలన
- 29 – నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన
- 30 – ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం
- 31 – నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు).. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా
- విడుదల
- ఫిబ్రవరి 5 – పోలింగ్ తేదీ (సర్పంచి ఎన్నిక కోసం ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 మధ్య పోలింగ్)
- పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక మధ్యాహ్నం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల వెల్లడి. దీని తర్వాత ఉపసర్పంచి ఎన్నికను పూర్తి చేయటంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.