ఏలూరులో బాధితులకు సీఎం జగన్ పరామర్శ

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురవుతున్న బాధితులను సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. అస్వస్థతకు దారి తీసిన కారణాలు.. ఇప్పటివరకు చేసిన పరీక్షల వివరాలు తెలుసుకున్నారు. ఇక బాధితులందరి రిపోర్టులు సాధారణంగానే ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. బాధితుల్లో అన్ని వయసుల వారు ఉన్నారని.. ఏలూరు అర్బన్‌తో పాటు రూరల్, దెందులూరులో కూడా కేసులు గుర్తించామన్నారు. ఇప్పటికే ఎయిమ్స్ నుంచి డాక్టర్ల బృందం వచ్చిందని.. ఐఐసీటీ, ఎన్‌ఐఎన్, ఐసీఎంఆర్ బృందాలు వస్తున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
హెల్త్ కమిషనర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 345 కేసులు నమోదు కాగా.. 160 మంది డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం 14 మంది విజయవాడ, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాము. వ్యాధి కారణాలు ఇప్పటికీ తెలియడం లేదని, నమూనాల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని ఆయన తెలిపారు. అస్వస్థతకు గురైన వారికి అన్ని వైరల్ టెస్టులు చేశాం. నీటిలో మెటల్ టెస్టులు కూడా చేశాం.. రిపోర్టులు రావాలి. సీఎంబీకి కూడా నమూనాలు పంపామని’ తెలిపారు.