కరోనాతో రాజస్థాన్ ఎమ్మెల్యే కిరణ్‌ మహేశ్వరి కన్నుమూత

జైపూర్‌: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఎవరిని వదలడంలేదు. సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా అందరిని కబళిస్తోంది. తాజాగా రాజస్థాన్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే కిరణ్‌ మహేశ్వరీ కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో అక్టోబర్‌లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల సమయంలో ఆమెకు వైరస్‌ సోకింది. మరో ఎమ్మెల్యే రాజేంద్రతో పాటు ఎన్నికల బాధ్యురాలిగా నియమితులైన మహేశ్వరీ కరోనా బారిన పడ్డారు. ఈనెల మొదటి వారం నుండి వైరస్‌తో పోరాడుతూనే ఉన్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆమె కన్నుమూశారు. కిరణ్‌మహేశ్వరీ మృతి పట్ల ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాలు సంతాపం తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో ఆమె కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఎమ్మెల్యే కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్‌ చేశారు. గత ఎన్నికల్లో రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆమె గెలుపొందారు. 2004లో ఉదరుపూర్‌ నుండి లోక్‌సభకు కూడా ఎన్నికయ్యారు. దేశంలో కరోనా బారిన పడి మరణిస్తున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

Leave A Reply

Your email address will not be published.