కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు : 45కి చేరిన మృతులు
భోపాల్ : మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికుల బస్సు సిధి జిల్లా పట్నా వద్ద అదుపు తప్పి వతెనపై నుంచి కాల్వలోకి దూసుకెళ్లింది. బస్సు పూర్తిగా కాల్వలో మునిగిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 45కి పెరిగింది. వీరిలో 24 మంది పురుషులు, 20 మంది మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు గల్లంతయిన వారిలో 18 మంది మృతదేహాలను వెలికి తీసినట్లు సహాయక సిబ్బంది వెల్లడించారు. కాగా మిగితా వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మంగళవారం ఉదయం 8:30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 45 మంది మృతదేహాలను బయటకు వెలికితీశారు. బస్సు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో.. మిగతా వారందరూ గల్లంతు అయ్యారు. క్రేన్ సహాయంతో కాలువలో పడి ఉన్న బస్సును బయటకు తీశారు. గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు చేపట్టిన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా బన్సాగర్ డ్యాం నుంచి కాలువకు నీటి విడుదలను ఆపేశారు. ప్రమాదానికి గురైన బస్సు సిధి నుంచి సాత్నా వైపు వెళ్తుండగా.. డ్రైవర్ అదుపు తప్పడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
మృతులకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన సిఎం చౌహాన్
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కాగా మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ప్రధాని, ఉపారాష్ట్రపతి తీవ్ర విచారం
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయాలపాలైన వారికి రూ. 50 వేలు చొప్పున ప్రధాని మోడీ పరిహారం ప్రకటించారు.