కెసిఆర్ పాలనలోనే పల్లెలు అభివృద్ధి : ప్రభుత్వ విప్ సుమన్

మంచిర్యాల : కెసిఆర్ పాలనలోనే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. జిల్లాలోని చెన్నూర్ మండలం నారాయణపూర్-దుగ్నెపల్లి గ్రామాల మధ్య రూ.1.83 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ..కాంగ్రెస్, టీడీపీల హయాంలో గ్రామాలకు రోడ్డు వ్యవస్థ సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నారన్నారు. మున్ముందు అన్నారం బ్యారేజ్ నుంచి చెన్నూర్, కోటపల్లి మండలాలకు లిప్టుద్వారా నీటిని అందించి, ఈ ప్రాంత రైతుల కష్టాలను తీర్చనున్నట్లు వివరించారు. అనంతరం రాయిపేటలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 103మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ 35,27,000 ఆర్థిక సాయం మంజూరు కాగా చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.