కోవిడ్: 53 శాతం ఈ మూడు దేశాల్లోనే!
కోవిడ్ పరీక్షల్లో భారత్ సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ : ఇంతకు ముందెన్నడు కనీ వినీ ఎరుగని రీతిలో కోవిడ్ విజృభిస్తోంది. అది ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దానికి ఈ దేశం.. ఆదేశం అనే బేధాభిప్రాయలు ఏమీ లేవు.. అన్ని దేశాలు ఒక్కటే అని చెలరేగిపోతోంది. దాంతో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువగా మూడు దేశాల్లోనే నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్, భారతదేశం.. ఈ మూడు దేశాల్లోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. వీటిలో 53 శాతం పైగా కేసులు ఈ మూడు దేశాల్లోనే నమోదయ్యాయి. అమెరికాలో 59 లక్షలు, బ్రెజిల్లో 38 లక్షలు, భారత్‌లో 35 లక్షలకుపైగా నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వ్యాప్తి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే బ్రెజిల్‌ను దాటి భారత్ రెండో స్థానానికి చేరుకుంటుంది.
కరోనా పరీక్షల్లో భారత్ రికార్డు.
భారత్‌లో కోవిడ్ ఉగ్రరూపం దాల్చుతోంది. ఎన్ని ఎక్కువ టెస్టు శాంపిల్స్‌ను పరీక్షిస్తే అదే రీతిన కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా 10,55,027 కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ప్రకటించింది. ఇది ఇప్పటి వరకూ నిర్వహించిన పరీక్షల్లో సింగిల్ డే రికార్డని తెలిపింది. గత 24 గంటల్లో 64,935 మందికి పూర్తి స్వస్థత చేకూరిందని, దీంతో దేశంలో రికవరీ రేటు 76.61 శాతానికి పెరిగిందని పేర్కొంది.
‘కేంద్రం సారథ్యంలో సమర్ధవంతంగా, వేగవంతంగా అమలవుతున్న టెస్టింగ్‌లపై 27,13,933 మంది పేషెంట్లకు స్వస్థత చేకూరడం సాధ్యమైంది. యాక్టివ్ కోవిడ్ కేసుల కంటే రికవరీ పేషెంట్ల కేసులు 3.5 రెట్లు అధికంగా ఉంది’ అని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరోవైపు, దేశంలో కరోనా కేసుల సంఖ్య 35 లక్షలకు చేరగా, ఒకేరోజులో 78,761 కేసులు, 948 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల్లో 7,65,301 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రాలపరంగా చూసుకుంటే, కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న రాష్ట్రాల్లో మొదటిదిగా మహారాష్ట్ర కొనసాగుతోంది. అక్కడ 7,47,995 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 23,775కి చేరింది. తమిళనాడులో 4,09,238 కేసులు నమోదై 7,050 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, బీహార్ ఉన్నాయి.
ఇదిలా ఉండగా కరోనా వైరస్ నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు టీకాను అభివృద్ధి చేసే పనిలో నిమగమయ్యాయి. భారత్‌లో సీరమ్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి ఆక్స్ఫర్డ్ అభివృద్ధి చేస్తున్న టీకా ఇప్పటికే రెండో దశ క్రినికల్ ట్రయల్స్ దశలో ఉంది.