గంటల వ్యవధిలో రాజస్థాన్‌లో 9మంది నవజాత శిశువులు మృతి

జైపూర్ : రాజస్తాన్‌లో కోటా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో ఘోరం చోటుచేసుకుంది. జెకె లాన్ ఆసుపత్రిలో గంటల వ్యవధిలోనే తొమ్మిది మంది నవజాత శిశువులు మృతి చెందారు. సరిగ్గా ఏడాది క్రితం ఇటువంటి ఘటనే చోటుచేసుకున్న సంగతి విదితమే. బుధవారం రాత్రి ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడగా..గురువారం మరో నలుగురు నవజాత శిశువులు మరణించారు. వీరంతా 4 రోజుల లోపు చిన్నారులేనని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ మంత్రి రఘు శర్మ విచారణకు ఆదేశించారు. ఈ చిన్నారులు ఇన్‌ఫెక్షన్, తీవ్రమైన జబ్బులు కారణంగా మరణించారని, ఇవి సాధారణ మరణాలుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ సురేష్ దులారా తెలిపారు. కోటా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ .. ఆరోగ్య మంత్రికి సమర్పించిన నివేదికలో పుట్టుకతో వచ్చిన రోగాల కారణంగా ముగ్గురు మరణించగా…మిగిలిన వారు ఆకస్మికంగా మరణించారని తెలిపారు. డివిజనల్ కమిషనర్ కెఎస్ మీనా, జిల్లా కలెక్టర్ ఉజ్వల్ రాథోడ్ ఆసుపత్రిని సందర్శించి…అనంతరం సమావేశమయ్యారు. కాగా, పరిస్థితి పర్యవేక్షించడానికి మరో ఆరుగురు వైద్యులు, 10 మంది నర్సులను నియమించాలని కమిషనర్ మీనా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. 2019 డిసెంబర్‌లో ఇదే ఆసుపత్రిలో 100 మంది చిన్నారులు చనిపోయి వార్తల్లో నిలిచిన సంగతి విదితమే.