గల్లీ గల్లీ బంద్‌ కావాలి.. ఢిల్లీ పెద్దల దిమ్మతిరగాలి: మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ : ఈ నెల 8వ తేదీన భారత్‌బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలని.. ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. హైదరాబాద్‌లో కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. గ్రేటర్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్న నిరాశలో ఉండొద్ద‌ని, ఎన్నికల్లో గెలుపోటములు సహజమని ఎప్పటి లాగే నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్దామని ఆయ‌న అన్నారు.

ఎన్నో పురోగమన చర్యలను తీసుకువచ్చిన రాష్ట్రంగా, ఒక అభ్యుదయ రైతుగా సీఎం కేసీఆర్‌ దేశంలోని రైతులకు సంఘీభావం ప్రకటించాలని నిర్ణయించారన్నారు. రైతుల పోరాట పటిమకు అందరి తరపున సెల్యూట్‌ చేస్తూ వారికి సంఘీభావంగా ఎల్లుండి జరిగే భారత్‌ బంద్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు విస్తృతంగా పాల్గొనాల్సిందిగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్‌చార్జీలకు, పార్టీ అనుబంధ రైతు విభాగ కార్యకర్గ సభ్యులకు, రాష్ట్రవ్యాప్తంగా ఉండే రైతుబంధు సమితి సభ్యులకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

వ్యాపారవేత్తలకు విజ్ఞప్తి..

అదేవిధంగా తెలంగాణ రైతాంగం పక్షాన కూడా ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలి కాబట్టి రాష్ట్రంలోని ప్రతి వ్యాపారవేత్త, వాణిజ్యవేత్తకు తామో విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. వ్యాపారులు సర్వసాధారణంగా ఉదయం 10 గంటలకు షాపులు తెరుస్తారు. కాగా భారత్‌బంద్‌ నేపథ్యంలో ఎల్లుండి మంగళవారం నాడు రైతులకి సంఘీభావంగా మరో రెండు గంటలు షాపులు తెరవకుండా ఉండాల్సిందిగా కోరారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో అక్కడ ఉండే వ్యాపారవేత్తలను పార్టీ శ్రేణులు కలిసి విజ్ఞప్తి చేయాల్సిందిగా సూచించారు.

కార్పొరేట్లకు వ్యవసాయాన్ని ధారాదత్తం చేసే కుట్ర..

కార్పొరేటర్లకు వ్యవసాయాన్ని ధారాదత్త చేసే కుట్ర జరుగుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో రైతన్న ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు. కేంద్రం తెచ్చిన చట్టాల వల్ల ఏ రకంగా అన్యాయం జరగబోతుంది. కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లో వ్యవసాయం ఏ రకంగా బందీ కాబోతుంది. ఈ నల్ల చట్టాల వల్ల కనీసం మద్దతు ధర కూడా రాకుండా కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నింది. వీటన్నింటిని ఎండగాల్సిన బాధ్యత మనమీద ఉందన్నారు. వ్యాపార, వాణిజ్య వేత్తలతో పాటు ట్రాన్స్‌పోర్లు కూడా బంద్‌కు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

భారత్‌ బంద్‌ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున తాము రెండు కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లు మంత్రి తెలిపారు. వాణిజ్య- వ్యాపార సంస్థలు రైతు బంద్ కు సహకరించండి. ట్రాన్స్ పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ బంద్ కు సహకరించండి అని కోరారు. టీఆర్ఎస్ పార్టీ మంత్రులు-ఎమ్మెల్యేలు-పార్టీ శ్రేణులు జాతీయ రహదారిపై ధర్నాలు- రాస్తారోకో చేస్తారు.. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు రోడ్లమీదకు రావొద్దని విజ్ఞప్తి చేశారు కేటీఆర్.

Leave A Reply

Your email address will not be published.