గాంధీలో కరోనా రోగులకు ధైర్యం చెప్పిన సిఎం కెసిఆర్
డాక్టర్లను, ఇతర వైద్య సిబ్బందిని అభినందించిన ముఖ్యమంత్రి

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. మంత్రి హరీష్ రావు, సిఎస్ సోమేశ్ కుమార్తో కలిసి ఆస్పత్రిలో కొవిడ్ చికిత్సలు, ఇతర సదుపాయాలను ఆయన పరిశీలిస్తున్నారు. కరోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను సీఎం పరామర్శించి, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లను, జూనియర్ డాక్టర్లను, ఇతర సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.
కొవిడ్ చికిత్సతో పాటు ఆక్సిజన్, ఔషధాల లభ్యత తదితర అంశాలపై అక్కడి వైద్యులతో మాట్లాడారు. సుమారు 40 నిముషాల పాటు సిఎం గాంధీ ఆసుపత్రి పర్యటన కొనసాగింది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఇవాళ గాంధీ ఆసుపత్రిని పరిశీలించారు.
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో గాంధీ ఆస్పత్రి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోగుల సహాయకులను బయటకు పంపించేశారు. గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో రసాయనాలతో పిచికారీ చేశారు.


