గ్రేటర్ ఫైట్: `కాంగ్రెస్‌లో ఇంటి పోరు?

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ప్రచార పర్వం మొదలైంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియలో పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక పక్క టిఆర్ ఎస్, బిజెపి పార్టీలు కారాలు మిరియాలు నూరుతున్నాయి.. ప్రచారంలో దూసుకుపోతున్నాయి. టిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్‌షోలు కూడా ప్రారంభించారు. కాని కాంగ్రెస్‌లో మాత్రం ఇంకా ప్రచారం సంగతి దేవుడెరుగు అంతర్గతంగా లొల్లి మొదలైంది. అభ్యర్ధుల విషయంలో నేతల మధ్య గొడవలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా బీ ఫారాల పంచాయితీ హస్తం పార్టీకి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. తాను చెప్పినవారికి బీ ఫారాలు ఇవ్వకపోతే సిటీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానంటూ అంజన్ కుమార్ యాదవ్ పీసీసీకి హెచ్చరిక జారీ చేశారు. అలాగే గోషామహల్ డివిజన్లో తన వర్గీయులకు బీ ఫారాలు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని వీడేందుకు ఇటు ముఖేష్ కొడుకు విక్రమ్ కుమార్ గౌడ్ సిద్ధమవుతున్నారు. అలాగే నామినేషన్ వేసిన ఐదు డివిజన్లలో అభ్యర్ధులను కూడా ఉపసంహరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. సమిష్టిగా గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన సమయంలో ఇలా ఇంటిపోరు ఇప్పుడు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. దీని నుంచి ఎలా బయటపడాలా అని సీనియర్లు తలలు పట్టుకున్నారు.