గ్రేటర్ ఫైట్: కేసీఆర్ సంచలన హామీలు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ సంచలన హామీలు ప్రకటించారు. జీహెచ్ఎంసీతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షౌరశాలలు(సెలున్లు)కు ప్రభుత్వం డిసెంబర్ నెల నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నేడు తెలంగాణ భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నాయి బ్రాహ్మణులు చాలా కాలంగా కోరుతున్న ఈ కోరికను రాబోయే డిసెంబర్ నుంచి ప్రభుత్వం నెరవేర్చనున్నట్లు తెలిపారు. నాయి బ్రాహ్మణుల ఆర్థిక పురోభివృద్ధికి ఈ చర్య తోడ్పడుతుందని సీఎం పేర్కొన్నారు.
ఆయన ఇచ్చిన హామీలలో ముఖ్యంగా డిసెంబర్ నుంచి నీటి బిల్లు కట్టాల్సిన పని లేదు. అంటే ఇక ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తామని ఆయన ప్రకటించారు. అలాగే 24 గంటలు నీటి సరఫరా చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్ లకు ఉచిత విద్యుత్ కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పరిశ్రమలు , షాపులు, ఆరు నెలల (మార్చి -october) మినిమం విద్యుత్ బిల్లులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక 40 వేల సినిమా కార్మికులకు రేషన్ కార్డు ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. అలాగే థియేటర్స్ విద్యుత్ చార్జీలు ప్రారంభం అయ్యే దాకా రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చిన్న సినిమాలకు రాష్ట్ర జీఎస్టీ వాటా కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.