గ‌డువులోపు యాదాద్రి ప‌నులు పూర్తి చేయాలి: సిఎం కెసిఆర్

హైద‌రాబాద్: త్వరలో యాదాద్రి లక్ష్మీనారసింహుని క్షేత్రాన్ని పున: ప్రారంభించనున్నందున నిర్ణయించిన గడువు లోపల ఆల‌యానికి తుది మెరుగులు దిద్దే పనులను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆల‌య అభివృద్ధి ప‌నుల‌పై ప్రగతిభవన్‌లో సీఎం శుక్రవారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

దర్శనానికి వచ్చే భక్తుల కోసం నిర్మిస్తున్న క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ గురించి పలు సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలన్నారు. క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను అధికారులు సీఎం ముందుంచారు.
శివాలయ నిర్మాణం గురించి అడిగి తెలుసుకున్న సీఎం, ఆలయ ప్రహరి గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలన్నారు. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించే విధంగా గ్రిల్స్, రెయిలింగ్‌ల‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా (ఐకానిక్ ఎలిమెంట్ లాగా) కనిపించే విధంగా తుదిమెరుగులు దిద్దాలని సీఎం అన్నారు. రాత్రి వేళల్లో ఆలయ సముదాయాన్ని, ప్రాంగణాలను చుట్టూ పరిసరాలను దివ్యమైన వెలుగులతో ప్రకాశించే విధంగా రూపొందించిన లైటింగ్ డెమో వీడియోను సీఎం తిలకించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు అనురాగ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, వైటీడీఏ ప్రత్యేకాధికారి కిషన్ రావు, టెంపుల్ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి, ఆర్కిటెక్ట్ మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.