‘చందమామ’ శంకర్ కన్నుమూత

హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు, ‘చందమామ’శంకర్‌గా పేరొందిన కరథొలువు చంద్రశేఖరన్ శివశంకరన్ (97) కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. తమిళనాడులోని ఈరోడ్ సమీపంలో ఉన్న కరథొలువు గ్రామంలో 1924 జులై 19న జన్మించిన శంకర్ లైన్ డ్రాయింగ్ అప్పట్లో ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. భేతాళ కథలు శీర్షిక కోసం ఆయన వేసిన విక్రమార్కుడు, బేతాళుడు రేఖాచిత్రం పాఠకుల మదిలో నిలిచిపోయింది. ‘చందమామ’ పత్రికను డిజైన్ చేసిన చిత్రకారులలో ఇంతవరకూ సజీవంగా ఉన్నది శంకర్ ఒక్కరే. ఇప్పుడు ఆయన మరణంతో ఆ శకం ముగిసింది.
చిన్నప్పటి నుంచే చిత్రాలు గీయడంలో ఆసక్తి పెంచుకున్న శంకర్ పన్నెండవ తరగతి పూర్తయ్యాక చెన్నైలోని ఆర్ట్ కాలేజీలో చేరారు. అక్కడ తనలోని చిత్రకారునికి మెరుగులు దిద్దుకున్నారు. ఆ తర్వాత 1946లో కళైమాగల్ అనే పత్రికలో తొలిసారి చిత్రకారునిగా కొలువులో చేరారు. అనంతరం 1952లో ‘చందమామ’లో చేరి, 2012లో ఆ పత్రిక మూతపడేవరకూ దాదాపు 60 ఏళ్ల పాటు అందులోనే పనిచేశారు. తన అద్భుత చిత్రాలతో చందమామ కథలను పాఠకుల కళ్లముందు సాక్షాత్కరింపచేశారు.
అపురూప చిత్రంః శంకర పిళ్లై, తోడావీరరాఘవన్, వడ్డాది పాపయ్య
చిత్రకారునిగా శంకర్ వేలాది చిత్రాలకు జీవం పోశారు. రామాయణం, మహాభారతం వంటి పురాణాలకూ ఆయన అద్భుత చిత్రాలు వేశారు. అయితే, ఆయనకు బాగా పేరు తెచ్చింది మాత్రం చందమామలో బేతాళ కథలకు రూపొందించిన చిత్రాలే. శంకర్ చందమామలో చేరేటప్పటికే అక్కడ మరో ఇద్దరు ప్రసిద్ధ చిత్రకారులు ‘చిత్రా’రాఘవులు, వడ్డాది పాపయ్య ఉన్నారు. ఆయన వేసిన బొమ్మలు అన్నీ ఒక ఎత్తయితే, బేతాళ కథలకు వేసిన శీర్షిక చిత్రం ఒక ఎత్తు. విక్రమార్కుడు ఒక చేతిలో కరవాలం పట్టుకొని, భుజంపైన శవాన్ని మోసుకుంటూ వెళుతున్నట్లుండే ఆ చిత్రం శంకర్‌కు ఎంతో పేరు తెచ్చింది.