టివిజి: దివిసీమ ఉప్పెనకు 43 ఏళ్లు..

దివిసీమ ఉప్పెన. ఈ పేరు వింటేనే కృష్ణా జిల్లాలోని దివిసీమ వాసులు ఉలిక్కిపడతారు. ఆ రాత్రి….కాళరాత్రి, కడలి కల్లోలానికి కకావికలమైన తీరప్రాంత గ్రామాలు.. శవాల దిబ్బగా మారిన ఊళ్ళు…. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉండే దివిసీమ సముద్రుడి ఉగ్రరూపాన్ని చూసిన రోజు అది. 1977 నవంబర్ 19 ఆ రోజు మధ్యాహ్నం సముద్రంలో చిన్న అలజడి ప్రారంభమైంది. సాయంత్రానికి అలజడి ఉదృతమైంది. ఆ తర్వాత ఆ ఉదృతి పెను ఉప్పెనగా మారింది. ఉప్పెన ఉగ్రరూపం దాల్చడంతో సముద్రుడు ఊళ్లకు ఊళ్లనే కబళించాడు.
అంతే తెల్లారెసరికి పదివేల మంది బ్రతుకులు తెల్లారిపోయాయి. దివిసీమ శవాల దిబ్బగా మారిపోయింది. ఎక్కడ చూసిన శవాలే, ఈ ఘటనలో నాలుగు లక్షల జంతువులు మృత్యువాతపడగా, మొత్తం 172కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. అంతటి విషాదాన్ని మిగిల్చిన ఆకాళరాత్రి గుర్తుకువస్తే దివిసీమ వాసులు ఇప్పటికి ఉలిక్కిపడతారు.
అసువులు బాసిన వారికి గుర్తుగా దివిసీమలో స్తూపాలు నిర్మించి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నేటికి దివిసీమలో ఎవరిని కదల్చినా ఆ విషాదచాయల గురించి కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు.
ఆ రోజు అసలేం జరిగింది ?
అంతకు ముందు రోజు రాత్రి నుండి తుఫాను హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. శనివారం నుంచి మూడు రోజులు స్కూళ్ళను మూసి వేస్తున్నట్లు కృష్ణా కలెక్టర్ అధికారికం గా ప్రకటించాడు. ఉదయం నుండి తీవ్రమైన నల్లటి మబ్బులు ఆకాశం అంతా కమ్ముకొని దాదాపు గంటకు వంద మైళ్ళ కంటే వేగం తో గాలులు మొదలైనాయి. రాత్రి పది దాటిన తర్వాత తుఫాను భీభత్సం పెరిగింది. మిన్నూ మన్నూ ఎకమ య్యేట్లు భీబత్సంగా వర్షం కురిసింది. అర్ధరాత్రి పూట కట్టలు తెంచుకున్న ప్రవాహం గ్రామాలపై విరుచుకుపడింది.
చిమ్మ చీకట్లో ఉధృతంగా విరుచుకుపడ్డ వరదలో అనేకమంది కొట్టుకుపోతూ.. తుమ్మ ముళ్ల కంపలకు చిక్కుకుని వేలాదిమంది ప్రాణాలు వదిలారు. పశుపక్ష్యాదులు సైతం మృత్యువాతపడ్డాయి. 200 కిలోమీటర్ల వేగంతో వీసిన ప్రచండ గాలులకు భారీ వృక్షాలు సైతం నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. గ్రామం మొత్తాన్ని శ్మశానంగా మార్చింది. శవాల గుట్టల మధ్య తమవారి ఆనవాళ్లను వెతికేందుకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. దాదాపు 14,204 మంది చనిపోయారు.
అతి భయంకరమైన ఈ తుఫాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14,204 మంది, అనధికారికంగా సుమారు 50,000 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని వలన సుమారు US$498.5 మిలియన్లు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
కోడూరు మండలంలోని పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం, గొల్లపాలెం, బసవవానిపాలెం, ఉల్లిపాలెం..నాగాయలంక మండలంలోని ఏటిమోగ, సొర్లగొంది, ఎదురుమొండి, సంగమేశ్వరం, నాచుగుంట, ఏలిచట్ల దిబ్బ తదితర మత్స్యకార గ్రామాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణాతోపాటు గుంటూరు జిల్లాలోనూ ఈ ఉప్పెన ప్రభావం కనిపించింది. రేపల్లె, నిజాంపట్నం తదితర గ్రామాలు ప్రళయం దాటికి దెబ్బతిన్నాయి.
కృష్ణా జిల్లా లోని దివిసీమలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసి పడ్డాయి. తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్న అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చింది. వాల్తేరు కిరండల్ రైలు మార్గంలో కొండ రాళ్ళు జారి పడి, పట్టాలను పెళ్ళగించాయి. బాపట్లలో ఒక చర్చిలో తలదాచుకున్న దాదాపు వందమంది ప్రజలు అది కూలడంతో మరణించారు. వరి పొలాలు, వాణిజ్య పంటలను ఉప్పెన ముంచెత్తింది. పదమూడు ఓడలు తుపానులో చిక్కుకుని గల్లంతయ్యాయి. కేవలం కృష్ణాజిల్లా పై మాత్రమే కాక గుంటూరు ప్రకాశం జిల్లా పై గూడా చాలా ఈ తుఫాను చాలా ప్రతాపం చూపింది.
తుపాను కలిగించిన తీవ్ర నష్టం ఆంధ్ర ప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. శాశ్వత తుపాను సహాయ శిబిరాలను తీరం పొడవునా ఏర్పాటు చేసారు. ఉప్పెన బారిన పడిన చిట్టచివరి గ్రామంలో తుపాను మృతుల స్మారకాన్ని నిర్మించారు. తుపాను కలిగించిన ధన, ప్రాణ నష్టాలను కప్పిపుచ్చి తక్కువ చేసి చూపించారని అధికారులు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలా తక్కువ చేసి చూపించారని రాష్ట్రంలో ప్రతిపక్షమైన జనతా పార్టీ ఆరోపించింది.ఈ ఆరోపణల కారణంగా ఐదుగురు ఉన్నతాధికారులు తమ పదవులకు రాజీనామా ఇచ్చారు.
డి.సోమ సుందర్, జర్నలిస్ట్ దివిసీమ అనుభవాలు ఇలా ఉన్నాయి.
1977 నవంబర్ 19.. కృష్ణా జిల్లా దివిసీమ ఉప్పెన తాకిడికి గురయిన రోజు.రాత్రికి రాత్రే వేలాది మంది అభాగ్యులు నిద్రలోనే అసువులు బాసిన రోజు. కనీ వినీ ఎరుగని పెను విపత్తు లో జీవితం అతలాకుతలం అయిన రోజు. కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు పై యువజన, విద్యార్థి బృందాలు రాష్ట్రం నలుమూలల నుండి దివిసీమ కు తరలి వచ్చాయి. బాధితుల సేవకు నడుంబిగించా యి. వందలాది కార్యకర్తలు రోజుల తరబడి దివి సీమ గ్రామాల్లో సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొన్నా రు.
అలా వెళ్లిన బృందాల లో పశ్చిమ గోదావరి జిల్లా నుండి నా బృందం ఒకటి. నేను, నాతో పాటు అత్తిలి, తాడేపల్లి గూడెం విద్యార్థులు, కార్మికులు మరో ఎనిమిది మంది. ఉప్పెన వచ్చిన వారా నికి తిన్నగా అవనిగడ్డ కి వెళ్ళాం. నాగాయలంక, అవనిగడ్డ కేంద్రాలుగా కమ్యూనిస్ట్ పార్టీ తరపున క్రింది స్థాయిలో సహాయ పునరావాస కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న కామ్రేడ్ దోనే పూడి దత్తు గార్ని కలుసుకున్నాం. ఆ సమయానికి కామ్రేడ్ కాకర్ల గోపీ చంద్, కామ్రేడ్ కంఠం నేని అచ్యుత రామయ్య గారు కూడా వున్నారు. రహదారుల లో వాహనాల రాకపోకలకు అడ్డు గా వున్న చెట్లు, గృహ శిథిలాలు, చెత్త , తొలగింపు బృందాలతో మమ్మల్ని పంపారు. అవి తీస్తే తప్ప రాకపోకలు సాగవు. ఒక వారం రోజులు మమ్మల్ని దత్తు గారు ఆపనికే పంపించారు. గుట్టలు గుట్టలుగా పడి వున్న శిధిలాల కింద, చెత్త కింద మాకు మానవ, జంతు కళేబరాలు తగిలేవి. భయంకర మైన దుర్వాసన వేసేది. అప్పట్లో మాస్క్ లు గ్లవ్స్ వంటివి లేవు. చేతి రుమాలు ముఖానికి కట్టుకుని, గడ్డి, చెత్త, ఆకులు,అలములతో కళేబరాలను తీయాల్సి వుండేది.
ఆ దిక్కూ, మొక్కూ లేని కళేబరాలకు అంతిమ సంస్కారాలు కూడా మేమే చేయాల్సి వచ్చేది. ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కు పోయిన కళేబరం భాగాలుగా విడి వడి పోయి వచ్చింది. కర్రల సాయంతో వాటిని ఒక చోటికి చేర్చి తగుల బెట్టాల్సి వచ్చింది. ఉదయం కాంప్ నుంచి వెళ్తే రాత్రికే తిరిగి వచ్చేది. మాకు మంచి నీరు, ఫుడ్ ప్యాకెట్ లను వేరే వారు తెచ్చి ఇచ్చేవారు. ఆతర్వాత మమ్మల్ని తహశీల్దార్ కార్యాలయం లో పనికి పంపారు. దేశం మొత్తం నుంచి సహాయ సామగ్రి కుప్ప తెప్పలుగా వచ్చి పడేవి. ప్రభుత్వ సిబ్బంది వాటి నిర్వహణ సరిగా చేయలేక పోయేవారు. స్థానిక తహశీల్దార్ సి.పీ.ఐ. నాయకులు దత్తు గారిని ఈ విషయం లో సాయం కావాలని అడిగారు. ఆయన మా బృందాన్ని, మరి కొందర్ని తాసీల్దార్ కు అప్పగించారు. బియ్యం, ఉప్పు,పప్పు, వంటి నిత్యావసర వస్తువులను, దుప్పట్లు, బట్టలను ప్యాక్ చేసి, లారీలకు ఎక్కించి గ్రామాలకు తరలించడం జరిగేది. ఉదయం నించి రాత్రి ఒంటి గంట వరకూ నిర్విరామంగా ప్యాకింగ్, లోడింగ్ పనులు చేసే వాళ్ళం. ఆ బృందాలు దాన్నొక యజ్ఞంలా చేసేవి కొందరు ఒక పూట చేసి వెళ్లి పోయే వారు. తర్వాత వేరే బృందం వచ్చేది. మేం మాత్రం ఎటూ కదలకుండా పట్టుదలగా అదే పని చేసే వాళ్ళం.
తాసీ ల్దార్ మా పనిని చూసి మీ వాళ్ళు బాగా చేస్తున్నారని దత్తు గారికి చెప్పే వాడు. తెల్ల వారు ఝామున లేచి పులిగడ్డ అక్విడక్ట్ వరకూ జీపు లో వెళ్లి మీటరు లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్లి అవతలి వైపు నుంచి ఇరవై లీటర్ల పాల క్యాన్లు ఓ డజను మోసు కొచ్చే వాళ్ళం. జీపులో వేసుకుని సి.పీ. ఐ. కాంప్ లో అంద చేసే వాళ్ళం. అక్కడున్న వాలంటీర్ దళాలకు ఉదయమే కాఫీ, టీ, ఇవ్వడానికి ఆ విధంగా మేం పాలు తెచ్చే వాళ్ళం. కొన్ని రోజుల తర్వాత మా బృందాన్ని ఉల్లి పాలెం, లక్ష్మి పురం వంటి గ్రామాలకు పంపేవారు. సర్వి బాదులు, వాసాలు, వెదురు గెడలు, తాటాకులు, తాళ్ళు, వంటి సామాగ్రిని గ్రామాలకు చేర్చే వాళ్లం. బాధితులు తాటాకు పాకలు, గుడిసెలు వేసుకోవడానికి సాయం చేసే వాళ్ళం. అలా మొత్తం మీద పద్దెనిమిది రోజులు అక్కడ వున్నాం. దత్తు గారు, గోపీ చంద్ గారు, అచ్యుత రామయ్య గారు మా బృందాన్ని ఎంతో అభిమానంగా, ప్రేమగా చూసుకున్నారు. ఆ తర్వాతి కాలంలో ఎక్కడ కనపడినా దివి సీమ ఉప్పెన నాటి మా పని తీరును ప్రస్తావిస్తూ అభినందించే వారు. ఆ నాటి కష్ట సమయం లో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల వెంట నిలబడి చేసిన సేవ, వారికి మనో ధైర్యం ఇచ్చిన తీరు అమోఘం. ఆనాడు తరలి వచ్చిన వందలాది మంది విద్యార్థి, యువజన వలంటీర్లలో మేం కూడా వుండటం, బాధితులకు సేవ చేసే ఒక అవకాశం రావడం, మరచిపోలేని ఒక అనుభూతి..
దివిసీమ సేవలకు ముందుకొచ్చిన ప్రముఖులు..
ఆనాటి శాసనసభ్యులు, మంత్రి మండలి వెంకట కృష్ణారావు దివి ప్రజలకు అండగా నిలవడంతో పాటు చెదిరిపోయిన దివిసీమకు పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి విశేష కఅషి చేశారు. ఉప్పెనలో చనిపోయిన మఅతుల శవాలకు స్వచ్ఛంద సంస్థలు, వివిధ రాజకీయ పార్టీ నేతలు, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీసులు దహన సంస్కారాలను నిర్వహించారు. అప్పటి పోలీస్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఎన్‌వి.నారాయణ రావు, ఐపిఎస్ పోలీసు బలగాలను దింపి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామాన్ని దత్తత తీసుకొని భవనాలను నిర్మించడం తోపాటు అందుకు చిహ్నంగా స్థూపాన్ని కూడా నిర్మించారు. ఆ స్తూపం నేటికీ దివిసీమ ఉప్పెన కు చిహ్నం గా ఉంది. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ, సేవామూర్తి మదర్ తెరిసా, దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు దివిసీమను సందర్శించి వారి సహకారాన్ని అందించారు.
1977 నవంబర్ 19 దివిసీమ ఉప్పెన కు 43 ఏళ్లు. ఇప్పటికీ దివిసీమ ప్రాంతాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. అర్ధరాత్రి అది ఒక కాళరాత్రిగా మిగిలింది. దివిసీమ ఉప్పెన కు సముద్రం పొంగి ఊళ్లపై పై విరుచుకుపడటంతో వేలాదిమంది చనిపోయారు. తీవ్ర ఆస్తి, పంట నష్టం జరిగింది, దీంతో దివిసీమ శవాల దిబ్బగా మారింది. ఆనాటి జ్ఞాపకాలు నేటికీ మమ్ముల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం నవంబరు నెల వస్తుందంటే భయపడటమే కాకుండా, వరదలు, తుఫానులు, భారీ వర్షాలు కురవడంతో ఆందోళన కలుగుతోంది. అలాంటి కాళరాత్రి మళ్లీ ఎప్పటికీ రాకూడదని కోరుకుంటున్నాం.
-టి.వి.గోవిందరావు