టి.వేదాంత సూరి: ఆక్లాండ్ లో గణేష్ మందిరం

ఆక్లాండ్ లో గణేష్ మందిరం వుంది. భారతీయులు, ప్రపంచ ఇతర దేశాల హిందువులు ఈ దేవాలయానికి వస్తుంటారు. ప్రతి రోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు . అయితే ఈ దేవాలయం ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం.

కౌలాలంపూర్ లో ఉంటున్న, జయకృష్ణ , ఆక్లాండ్ లో వుండే, ఆమె సోదరి పుష్ప సెల్వ కుమార్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణతో ఈ ఆలయం రూపు దిద్దుకుంది. తమిళుల కోసం వినాయక మందిరం నిర్మిస్తే బాగుంటుందన్నది వారి ఆలోచన. వెంటనే సెల్వకుమార్ తో పాటు ఇతర వ్యాపార ప్రముఖుల సహాయ సహకారాలు తీసుకున్నారు. ఫలితంగా 1998లో సెల్వకుమార్, రామన్ అన్నామలై కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసారు. ఆ తరువాత పాపకూరలో స్థలం సేకరించి భూమి పూజ చేశారు. ఆ తరువాత మలేసియాకు చెందిన వారు, వేరే వ్యాపార వెతలు కలిసి నిధులు సమీకరించి దేవాలయాన్ని నిర్మించారు. 2002 జూన్ లో దేవాలయం ప్రారంభమైంది.

2002 సెప్టెంబర్ లో ఇక్కడ మహా కుంభాభిషేకం జరిగింది. 2005 శివ, అంబర్ విగ్రహ ప్రతిష్ట జరిగింది. 2010లో పెద్ద హాల్ ను నిర్మించారు. 2012లో నవగ్రహాలను ఏర్పాటు చేశారు. 2015 జూన్ నుంచి ఆగష్టు వరకు భారతీయ పని వారు వచ్చి ఇతర విగ్రహాలను అందులో ఏర్పాటు చేశారు. దేవాలయ 12వ వార్షికోత్సవం సందర్బంగా 2015లో మహా కుంభాభిషేకం నిర్వహించారు. 2016 లో శ్రీలంక వారి సహకారంతో రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆలయ ప్రధాన అర్చకుడు చందు కుర్కళ్ సహా అర్చకుడు వాసు దేవన్ కుర్కళ్ ఆధ్వర్యంలో నిరంతర పూజలు నిర్వహిస్తున్నారు.

వారాంతం సెలవుల్లో వివిధ దేశాలకు చెందిన హిందువులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తుంటారు. అన్ని పర్వదినాల సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రసాద వితరణ చేస్తుంటారు. భవిష్యత్తులో దేవాలయాన్ని మరింత విస్తరించి రాజగోపురాన్ని నిర్మించాలన్న ఆలోచన వుంది.

ఇక్కడ నిత్య అర్చన, అష్టోత్తర అర్చన, మోక్ష అర్చన, వాహన పూజ, అన్న ప్రసాదం, సహస్ర నామ అర్చన, గణేశునికి ద్రవ్య అభిషేకం,, రుద్రాభిషేకం, ఏక కుంభాభిషేకం, సత్యనారాయణ పూజ, ఆయుష హోమం, గణపతి హోమం శనివారం అన్న దానం, నవగ్రహ హోమం, అభిషేకం, తదితర ఎన్నెన్నో పూజలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఇక్కడికి వెళితే తమిళ నాడు లోని పవిత్ర దేవాలయంలో వుండే అనుభూతి కలుగుతుంది. అర్చకులు మలేషియా తమిళులు కాబట్టి, భారతీయ సంప్రదాయాలనే పాటిస్తారు.

-టి.వేదాంత సూరి
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు

Leave A Reply

Your email address will not be published.