టి.వేదాంత సూరి: ఓటరూ! ఒక్క సారి ఆలోచించండి.. తస్మాత్ జాగ్రత్త..
మీరు హైదరాబాద్ లో వుంటున్నారు. జిల్లాల్లో, గ్రామాల్లో ఉండేవారి కంటే ఎక్కువ బాధ్యత, విచక్షణ మీలో ఉండాలి. నగరాన్ని బాగు చేసుకోవాలన్న తపన కూడా మీలో ఉండాలి. అందుకోసం ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. తొందర పడకండి. ఎవరో చెప్పిన మాట వినకండి. పార్టీలను పట్టించోకోకండి. జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు మీకు ఏమీ చేయవు. మీ కార్పొరేటర్ మీకు అందుబాటులో ఉండాలి. అవసరానికి ఆదుకోవాలి… మీరు ఐదేళ్ల పాటు గుండెలపై చేయివేసుకుని హాయిగా ఉంచేవారు కావాలి. ఎవరో తెలియని పనికి మాలిన వారికే ఓటు వేస్తె ఫలితం అలాగే ఉంటుంది. మీ చేతిలో పాశుపదాస్త్రం వుంది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. పది రూపాయలు పెట్టి కొనుగోలు చేసే ఒక వస్తువును తీసుకోవాలంటే ఎంతో ఆలోచిస్తాం. కానీ మనకోసం ఐదేళ్ల పాటు పని చేసే వారిని ఎన్నుకునేపుడు ఎంతో ఆలోచించాలి.
మీరు అవసరమనుకుంటే అభ్యర్థులతో మాట్లాడండి. అందరి అభ్యర్థులను ప్రశ్నించండి.. మీకు ఓటు వేస్తె మాకు ఏం చేస్తారని అడగండి, ఎలా చేస్తారని అడగండి. మీకే ఎందుకు వేయాలి? అని అడగండి. ఇలా అందరు అభ్యర్థులను వ్యక్తిగతంగా కలిసి అడగండి. వారిచ్చే సమాధానాలను రాసి వారి హామీలను ఒక కాగితం పై రాసుకుంటూ మీ వద్ద ఉంచుకుని… అప్పుడు ఓ నిర్ణయం తీసుకోండి. వారి ఫోన్ నెంబర్ లను మీ వద్ద ఉంచుకోండి. నగర అభివృద్ధిపై మీ బాధ్యత కూడా వుంది. అందరిని విమర్శిస్తూ కాలక్షేపం చేయడం సరి కాదు. మీ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించండి. ఆ తరువాత ఓటు వేయడానికి సంసిద్ధం కావాలి. ప్రచారాలు, కరపత్రాలను నమ్మకండి. మ్యానిఫెస్టోలను కూడా పట్టించుకోకండి. ఎవరి వద్దా స్పష్టత లేదు. మీరు అమాయకులు, మసిపూసి మారేడు కాయ చేయొచ్చు అనే నాయకులందరూ అనుకుంటారు. అందుకు వారు అలవాటు పడ్డారు… వారి ఆలోచనలను మీరు తారుమారు చేయండి. మీ అవకాశాన్ని జాగ్రత్తగా వినియోగించుకొండి. రేపు ఏ పొరపాటు జరిగినా, అభివృద్ధి లేకపోయినా మీరు వారిని విమర్శించొద్దు. మీరే ఆత్మ విమర్శ చేసుకోవాలి. సరైన పాలన లేకుంటే బాధ్యులు మీరే. తస్మాత్ జాగ్రత్త.
-టి.వేదాంత సూరి