తెలంగాణలో భూస్వాములే లేరు!
రాష్ట్రంలో పది ఎకరాల్లోపు రైతులే 98.38 శాతం మందిః సిఎం కెసిఆర్
హైదరాబాద్ : తెలంగాణలో భూములే లేరు.. భూస్వాముల కోసం చట్టాలు తేలేదు. మట్టి పిసుక్కొని బతికే రైతుల హక్కులు కాపాడడమే లక్ష్యంగా కొత్త చట్టం తెచ్చాం. రాష్ట్రంలో 90 శాతం భూములు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద వర్గాల వద్దే ఉన్నాయి. రాష్ట్రంలో 60.98 లక్షల మంది పట్టాదారులుంటే అందులో ఐదెకరాల్లోపు భూములు 90 శాతానికి పైగా పేదల వద్ద ఉన్నాయి. 2.5 ఎకరాల్లోపు వారు 39.52 లక్షల మంది, 2.5 నుంచి 3 ఎకరాల్లోపు వారు 4.70 లక్షల మంది, 3 నుంచి 5 ఎకరాల్లోపు వారు 11 లక్షల మంది, 5 నుంచి 7 ఎకరాల్లోపు 3.49 లక్షల మంది, 7 నుంచి 10 ఎకరాల్లోపు లక్ష మంది అంతిమంగా 98.38 శాతం మంది పదెకరాల్లోపు భూములు కలిగిన వారు ఉండగా.. 25 ఎకరాలపైన భూమి ఉన్న వారు 6 వేల మందే ఉన్నారని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు చెప్పారు. గిరిజన ప్రాంతాలు, ఏజెన్సీల్లోని గిరిజనుల భూముల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. ఈ భూములు కేంద్రం పరిధిలో, 1/70 చట్టానికి అనుగుణంగా యథాతథంగా కొనసాగుతాయని, నమోదైన రైతులకు రైతుబంధు, బీమా, ఇతర సౌకర్యాలు ప్రభుత్వపరంగా యథావిధిగా కొనసాగిస్తా మన్నారు. ఇవి తప్ప మిగతా భూములన్నీ రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోనే ఉంటాయన్నారు. సోమవారం శాసనమండలిలో నూతన రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టాక సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణలోని 7 మండలాలను అప్రజాస్వామికంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిపిందని, ఆర్డినెన్స్ జారీచేసి అరాచకంగా దెబ్బకొట్టిందన్నారు. వక్ఫ్, ఎండోమెంట్ భూముల పరిరక్షణకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టిన విధంగా క్రైస్తవ సంస్థల భూముల విషయంలో స్పందించడం సాధ్యం కాదన్నారు. క్రైస్తవ సంస్థల భూముల లెక్కలు లేవన్నారు. భూముల వివరాలు సమర్పించి, తమకు కూడా బోర్డు ఉండాలని క్రైస్తవ సంస్థల పెద్దలు నిర్ణయిస్తే ఆలోచిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో భూసర్వేను ఏడాది, ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని, ఇందుకోసం జిల్లాల వారీగా ఎక్కడిక్కడ ఏజెన్సీల సహాయం తీసుకుంటామన్నారు. అన్ని అత్యాధునిక హంగులు, సాంకేతికతతో ధరణి పోర్టల్‌ను త్వరలోనే రూపొందించేందుకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నామన్నారు. పారదర్శకంగా ఉండేలా ఈ పోర్టల్‌ను రూపొందించి పబ్లిక్ డొమెయిన్‌లో పెడతామని, ప్రపంచంలోని ఏమూల నుంచైనా వివరాలు డౌన్లోడ్ చేసుకోవచ్చునని, అయితే దీనిలో మార్పలు చేయడం మాత్రం సాధ్యం కాదని చెప్పారు. వెబ్సైట్ అందుబాటులో వచ్చాక పాస్‌పుస్తకాలు కూడా అప్రస్తుతమైపోతాయని, వీటి వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే అవకాశముందన్నారు. కౌలుదారులను పట్టించుకోమని, అది తమ పార్టీ పాలసీ అని చెప్పారు.
కొత్త రెవెన్యూచట్టంలో భాగంగా వ్యవసాయేతర భూములకు ‘మెరూన్’ కలర్ పాస్‌బుక్‌లు జారీ చేయనున్నట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వ్యవసాయేతర భూములను తేలిగ్గా గుర్తించేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. భూమి శిస్తు వసూలు వంటివి లేకపోవడంతో, వీఆర్ఓల పాత్ర అప్రస్తుతంగా మారిందని, అయితే వీరిలో కొందరిని ఊరికి ఒకరిని తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నామని, ఆ మేరకు అవసరం కూడా ఉందన్నారు. నీరడి, ఇతర పనుల కోసం నీటిపారుదల శాఖలో వీరి సేవలు ఉపయోగించుకునే వీలుందన్నారు. రిజిస్ట్రేషన్‌లో భాగంగా కౌలు, అనుభవదారుల కాలమ్ ఉండదని, దానిని అందులో పెట్టబోమని కుండబద్ధలు కొట్టినట్టు చెబుతున్నామన్నారు. ఈ చట్టంలో సబ్రిజిష్ట్రార్లకు కూడా తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే అధికారం, ఎక్కడికక్కడ భూముల ధరలు నిర్ణయించే అధికారం ఉండదని స్పష్టం చేశారు. మొత్తంగా రెవెన్యూశాఖ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి చెప్పారు. అవినీతిని కేవలం వీఆర్ఓలకు పరిమితం చేయడం సరికాదని, ఇటీవల అడిషనల్ కలెక్టర్, ఎమ్మార్వో, ఇతర అధికారుల అవినీతి ఉదంతాలు కూడా బయటపడ్డాయన్నారు. లాండ్ రికార్డ్స్ అప్డేషన్పై దృష్టిపెట్టాలని, నేటికి 10 నుంచి 12 లక్షల మంది రైతుల పాస్‌పుస్తకాలు రాలేదన్నారు. రెవెన్యూ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని జీవన్‌రెడ్డి కోరగా… సీఎం కేసీఆర్ స్పందిస్తూ అది సాధ్యం కాదన్నారు. అసెంబ్లీ లాగే ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. ఎంఐఎం సభ్యులు అమీనుల్ జాఫ్రీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, డి.రాజేశ్వరరావు, టీచర్ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దనరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు.