త‌దుప‌రి సిజెఐగా ఎన్వీ ర‌మ‌ణ

పేరు సిఫార‌సు చేసిన‌ ఎస్ఏ బోబ్డే

న్యూఢిల్లీ: భార‌త త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియ‌మితులు కానున్నారు. త‌న త‌ర్వాత 48వ చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ ర‌మ‌ణ పేరును సిఫార‌సు చేశారు‌ ప్ర‌స్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే. ఈ మేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ‌కు లేఖ రాశారు. ఆయ‌న ప‌ద‌వీ కాలం ఏప్రిల్ 23తో ముగుస్తోంది. దీంతో త‌న వారసుడి పేరును సిఫార‌సు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం బోబ్డేను కోరింది. గ‌త శుక్ర‌వార‌మే కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ ఈ మేర‌కు బోబ్డేకు లేఖ రాశారు. జ‌స్టిస్ ఎస్ఎ బోబ్డే ప్ర‌తిపాద‌న‌ను కేంద్ర న్యాయ‌శాఖ‌.. హోంశాఖ‌కు పంప‌నుంది. హోం శాఖ ప‌రిశీల‌న అనంత‌రం ఈ ప్ర‌తిపాద‌న రాష్ట్రప‌తి కార్యాల‌యానికి వెళ్తుంది. రాష్ట్రప‌తి ఆమోదంతో సిజెఐ ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌వుతుంది.

జ‌స్టిస్ బోబ్డే ఏప్రిల్ 23న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఏప్రిల్ 24న జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ సిజెఐగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. 2022 ఆగ‌స్టు 26 వ‌ర‌కు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగుతారు.

బోబ్డే త‌ర్వాత ఎన్వీ ర‌మ‌ణ‌నే సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉన్నారు. 1957, ఆగ‌స్ట్ 27న జ‌న్మించిన ర‌మ‌ణ ప‌ద‌వీ కాలం 2022, ఆగ‌స్ట్ 26తో ముగుస్తుంది. నిబంధ‌న‌ల ప్ర‌కారం సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్‌కే చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ప‌ద‌వి ద‌క్కాల్సి ఉంటుంది.

ఢిల్లీలో తెలుగు వారి ఖ్యాతిని నలు దిశలు వ్యాపింప చేసిన వారిలో ప్రధాని గా పని చేసిన పి.వి.నరసింహరావు మొదటి వారు కాగా రెండవ వారు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, మూడవవారు జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ న్యాయ నిపుణులు,

బాల్యము

ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లోని పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27 న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. గణపతిరావు, సరోజిని ఆయన తల్లిదండ్రులు. ఆయన కంచికర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసి, అమరావతి లోని ఆర్.వి.వి.ఎన్.కాలేజీలో బి.యస్సీలో పట్టా పొందారు. 1982 లో నాగార్జున విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో పట్టా తీసుకొని 1983 ఫిబ్రవరి 10 న రాష్ట్ర బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదై న్యాయవాదిగా వృత్తి ప్రారంభించారు.

న్యాయ వృత్తి

1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతర్రాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. పలు ప్రభుత్వ సంస్థలకు ప్యానల్ అడ్వకేట్‌గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. అదనపు అడ్వకేట్ జనరల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ, విదేశాల్లో జరిగిన పలు న్యాయసదస్సుల్లో జస్టిస్ రమణ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్నారు.. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా

ఢిల్లీ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన డి మురుగేశన్ జూన్ లో పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో జస్టిస్ రమణను ప్రధాన న్యాయమూర్తిగా భారత ప్రధాన న్యాయమూర్తి పి. సతాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఈ మేరకు 2013 సెప్టెంబరు 2 సోమవారం రోజు, రాజ్ నివాస్ లో ఆడంబరంగా జరిగిన ఓ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ చేతుల మీదుగా జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం చేశారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా

2014 ఫిబ్రవరి 7 న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టీస్ చలమేశ్వర్ సుప్రీం కోర్టులో న్యాయ మూర్తిగా చేసి రిటైర‌య్యారు.. ప్ర‌స్తుతం వెంకట రమణ సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ మూర్తిగా కొన‌సాగుతున్నారు. 1966 జూన్ 30 నుండి 1967 ఏప్రిల్ 11 వరకు మరో తెలుగు వ్యక్తి కోకా సుబ్బారావు సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలను నెరవేర్చారు.

విశేషాలు

తెలుగు భాషపై మక్కువ ఎక్కువ. అవసరమైతే తప్ప ఆంగ్లంలో మాట్లాడరు. తెలుగులోనే పలుకరిస్తారు. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా తెలుగునే ఎక్కువగా వాడుతుంటారు. కోర్టు వ్యవహారాల్లో పారదర్శకత అవసరం. మనకు తెలిసిన మన యాసతో కూడిన, మన తెలుగుభాషలో మాట్లాడడానికి, కేసుల్లో వాదించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు అంటారు.

ఆల్మట్టి పై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున న్యాయవాదిగా పనిచేశారు. 13 సంవత్సరాల కాలంలో దాదాపు 60వేల కేసులను పరిష్కరించారు. ముస్లిం రిజర్వేషన్లపై విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల ధర్మాసనంలో జస్టిస్‌ రమణ ఒకరు. ఈ కేసులో మెజారిటీ జడ్జీల తీర్పుతో ఆయన విభేదించారు. కులాలు, మతాలవారీ రిజర్వేషన్లు సంఘాన్ని విడగొడతాయని, రిజర్వేషన్లు ఎప్పుడూ ఆర్థిక అసమానతల ఆధారంగానే ఉండాలన్నారు. పర్యావరణ కేసుల్లో చెరువు లు, కుంటల పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టరాదని, అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని తీర్పులు చెప్పారు.

-టి.వి.గోవిందరావు

Leave A Reply

Your email address will not be published.