దేశ భద్రతే మాకు ముఖ్యం
టన్నెల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ

సిమ్లా : హమాచల్‌లోని ఫంజల్ పర్వత శ్రేణిలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన ‘అటల్ టన్నెల్’ ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ…ఇవాళ చరిత్రాత్మకమైన రోజు. హిమాచల్ ప్రజల దశాబ్ధాల ఎదురుచూపులు నేడు ఫలించాయి. వాజ్‌పేయీ స్వప్నాలను మేం సాకారం చేశాం` అన్నారు. అలాగే ఇంత శక్తిమంతమైన, ముఖ్యమైన టన్నెల్ సరిహద్దుకు సంబంధించిన మౌలిక సదుపాయాలను మరింత పటిష్ఠ పరుస్తుందని, కొత్త బలాన్ని చేకూరుస్తుందని ప్రకటించారు. కొత్త కొత్త సంస్కరణలను తేవడం ద్వారా సరికొత్త, అధునాత ఆయుధాలు దేశంలోనే తయారు చేసుకోడానికి వీలవుతుందని అన్నారు.
దేశ భద్రతే తమ ప్రభుత్వానికి ముఖ్యమైన అంశమని, అంతకంటే ముఖ్యమైన అంశం తమకు మరొకటి లేదని ప్రధాని స్పష్టం చేశారు. అయితే రక్షణ రంగంలో రాజీపడ్డ ఘటనలను కూడా ప్రజలు చూశారని గత ప్రభుత్వాలపై మోదీ అన్యాపదేశంగా మండిపడ్డారు. సరిహద్దు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తాము అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ ఫలాలు కేవలం భద్రతా బలగాలకే అందవని, దేశంలోని సామాన్యులకు కూడా అందుతాయని ప్రకటించారు. చాలా కాలం తర్వాత మహా దళపతి బిపిన్ రావత్ కూడా మన వ్యవస్థలో భాగం అయ్యారని, భారత సైన్యానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సేకరించే విషయంలోనూ, ఉత్పత్తి చేసే విషయంలోనూ మంచి సమన్వయం ఏర్పడిందని మోదీ ప్రశంసించారు.
అంతేకాకుండా ఈ టన్నెల్‌ను నిర్మించిన విధానం, చేసిన శ్రమను అధ్యయనం చేయడానికి వీలుగా ఇంజినీరింగ్ విద్యార్థులకు అవకాశం కల్పించాలని కేంద్ర విద్యాశాఖను కూడా మోదీ ఆదేశించారు. టన్నెల్ నిర్మాణం ప్రారంభించిన సమయంలో నిపుణులను అడిగితే… 2040 లో పూర్తవుతుందని నిపుణులు పేర్కొన్నారని, అయితే… కేవలం ఆరు సంవత్సరాల్లోనే దీనిని పూర్తి చేసి చూపించామని అన్నారు. ఇందుకు పనిచేసిన ఇంజినీర్లు, అధికారులు, ఇతర సిబ్బందికి మోడీ అభినందనలు తెలిపారు. 2013-14 నాటికి కేవలం 1300 మీటర్ల మేర మాత్రమే సొరంగ నిర్మాణం జిరిగింది. ఇలాగే కొనసాగితే 2040నాటికి సొరంగం నిర్మాణం పూర్తవుతుందని నిపుణులు అన్నారు. కాని మేం అధికారంలోకి వచ్చాక ఎంతో వేగంగా దీన్ని పూర్తి చేశాం అన్నారు. పెండింగ్‌లో ఉన్న మిగితా ప్రాజెక్టులను కూడా ఇదే తరహాలో త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ` ఈ టన్నెల్ దేశ ఆర్ధిక, వాణిజ్య అవసరాలు తీరుస్తుంది. ఆహార పదార్థాలు, వాణిజ్య సరుకుల రవాణా సులబతరం అవుతుంది` అన్నారు. సరిహద్దుల్లో కాపలాకాసే సైనికులకు ఈ సొరంగ మార్గాన్ని అంకితం చేస్తున్నట్లు తెలిపారు.