నాగార్జునసాగర్ 10 గేట్లు ఎత్తివేత
హైదరాబాద్: రాష్ర్ట వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు తెలంగాణ తడిసి ముద్దైంది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. దీంతో వరదలు పోటెత్తాయి. భారీ వరదలతో రాష్ర్టంలోని అన్ని జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ఎడతెరపి లేని వర్షాల కారణంగా ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలోని ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. దీంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటికి తోడు వరద నీరు కూడా భారీగా వచ్చి చేరుతుండటంతో నాగార్జున సాగర్ కూడా నిండు కుండలా మారింది. నాగార్జున సాగర్ మొత్తం పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులకు చేరింది. అదేవిధంగా సాగర్ మొత్తం నీటి నిలువ సామర్థ్యం కూడా 312.05 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిలువ 309.95 టీఎంసీలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం డ్యామ్‌లోని 10 క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర పైకిఎత్తారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ దిగువకు పరుగులు తీస్తున్నది. కాగా ఈ నెల 28న ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో రెండు, మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ మధ్య కర్ణాటక వరకు ఉపరిత ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవాళ అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ జిల్లాలో జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో అధికారులంతా హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. వర్షాలు, వరదలు దృష్ట్యా అధికారులకు ప్రభుత్వం సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎస్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు.
#WATCH Telangana: 10 crest gates of Nagarjuna Sagar Dam in Nalgonda District opened by five feet each today. pic.twitter.com/FpWs90fJSu
— ANI (@ANI) September 26, 2020