పంగిడి గూడెం మహారాజులు

సంగీతం, నృత్యం, చిత్రకళా, చారిత్రిక కావ్యాలు, ప్రబంధ రచనకు నిలయమైన సంస్థానాలు వల్లూరు, పంగిడిగూడెం. వల్లూరును ”తోట్ల వల్లూరు” అంటారు. ఉయ్యూరుకు అయిదు కిలో మీటర్ల దూరంలో కృష్ణా నది ఒడ్డున వుంది. అరవై గ్రామాలతో విలసిల్లింది. మచిలీపట్నం విజయవాడ తాలూకాలలోను, పశ్చిమ గోదావరి లోని ఏలూరు తాలూకాలోను ఈ జమీందారి విస్తరించి వుంది. పచ్చని పంటలకు నిలయం. ఈ సంస్థానానికి వల్లూరే రాజధాని. కృష్ణకు తూర్పు గట్టున వుంది. కొబ్బరి, మామిడి తోటలతో కళ కళ లాడుతూ వుండటంతో తోట్ల వల్లూరు అయింది. కొంత కాలమ్ నూజివీడు, చల్లపల్లి జమీందారిలో వుంది. 1900లో అన్నదమ్ముల పంపకాల వల్ల ఉత్తర దక్షిణ వల్లూరులుగా మారింది. పట్నాల వంశీకులైన బొమ్మ దేవర వంశం వారు వల్లూరు పాలకులైనారు. 300 ఏళ్ళు వీరి పాలనలో వుంది. పంగిడిగూడెం పశ్చిమగోదావరి గోదావరి జిల్లాలో ద్వారకా తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది. ఆ కాలంలో నిర్మించబడిన వేణు గోపాలస్వామి ఆలయం అప్పట్నించి ఇప్పటి వరకు భక్తులను ఆకర్షిస్తూనే వుంది.

దసరా ఉత్సవాలు భారత దేశంలో మైసూర్ మహారాజా తరువాత పంగిడిగూడెంలో అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ చూడడానికి ఈస్ట్ ఇండియా ప్రతినిధులు, మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ లు పంగిడిగూడెం వచ్చే వారు.1925లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు హాజరయ్యారు. బొమ్మదేవర వారి మేనల్లుడు రాజా మోతే హరిబాబు నాయుడు 1946 లో మద్రాస్ హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కూడా పని చేసారు.

 

సంస్థాన ఆవిర్భావంః

1650లో బొమ్మదేవర నాగన్న నాయుడు మొదటి జమీందార్. ఈయనను ఎడ్ల నాగన్న నాగన్న నాయుడు అంటారు. అపారమైన పశుసంపద ఉండేది. వేలాది జతల ఎడ్లు ఉండేవి. గోల్కొండ నవాబులకు అవసరమైన ఆహార పదార్ధాలను ఎడ్ల బండ్ల మీద, హైదరాబాద్ తీసుకొని వెళ్లి అందజేసేవారు. నవాబుల ఆస్థానంలో వున ఉల్ల్లి పొట్టు నిలవ చేసే గదిలో బంగారం, వజ్ర వైదూర్యాలు కనిపించాయి. ఈ విషయం నాగయ్యనాయుడు నవాబు దృష్టికి తీసుకొని వెళ్ళాడు. వాటిపై వ్యామోహం పడని నవాబు వాటిని నాగయ్యనాయుడికే కే అందజేశారు. ఈ సంఘటన 1645లో జరిగింది. ఆ అపార ధన రాశుల్ని ఎడ్ల బండ్ల మీదనే వల్లూరు తోలుకు వచ్చాడు నాగయ్య నాయుడు. తొమ్మిది ఎకరాల స్థలంలో ఆ ధనం లో కొంత ఖర్చు చేసి కోట కట్టించాడు. బ్రిటిష్ వారి కాలమ్ లో కూడా ఎడ్ల బండ్ల మీద నీరు సరఫరా చేశారు. కలెక్టర్ ఇచ్చిన లీజు భూమి తవ్వు తుంటే బంగారం లభించింది. అది నాగయ్యనాయుడికే చెందుతుందని కలెక్టర్ ప్రకటించారు. దానితో నాగన్న నాయుడు పెద్ద జమీందార్ అయాడు. నాగన్న నాయుడు అతని సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ”రాజబహదూర్” బిరుదు ప్రదానం చేసింది. తోట్లవల్లూరు జమ్మి చెట్టు వద్ద వున్న బావిలో వేణు గోపాలస్వామి విగ్రహం లభించింది. నాగన్న నాయుడే దాన్ని ప్రతిష్టించాడని, ఆలయం నిర్మించాడని తెలుస్తోంది. తర్వాత దక్షిణ దేశ యాత్ర చేసి, అక్కడి గోపుర నిర్మాణానికి ఆశ్చర్యపోయి, ఇక్కడ కూడా 90 అడుగుల ఎత్తున రాజగోపురం, ముఖ మండపం నిర్మించాడు. ఆళ్వారుల ప్రతిష్ట కూడా చేశాడు. అప్పటి నుంచి బొమ్మ దేవర వారిదే మొదటి పూజ. 12 రోజులు కళ్యాణ ఉత్సవాలు నిర్వహింప జేశాడు. ఏనుగు అంబారిపై గోపాలస్వామితో పాటు నాగన్న కూడా ఊరేగే వాడట. నాగన్న 1650 నుంచి 1808 వరకు జీవించి వున్నాడు. 1803లో కోట కట్టించాడు. శ్రీరంగపట్నం యుద్ధం లో నాగన్న సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ”రాజా” బిరుదు నిచ్చింది. 1808లో ఖమ్మం నుంచి తిరిగి వస్తు జబ్బు పది దారిలోనే మరణించారు. నాగన్న నాయుడు అనే పేరు బొమ్మదేవర వంశం

ద‌క్షిణ వ‌ల్లూరు జ‌మీందారు

లో అందరికీ పెట్టు కున్నారు. నాగన్న నిరుడు నాల్గవ కుమారుడు బొమ్మదేవర వెంకట నరసింహ నాయుడు తండ్రి చనిపోయే నాటికి మైనరు తల్లి శేషమాంబ అతని తరఫున వ్యవహారాలను చూసేది. నరసింహ నాయుడు కూడా, తండ్రిలాగ కంపెని వారికి అణుకువగా వున్నాడు. జమీని అన్ని విధాల అభివృద్ధి చేశాడు. భార్య రాజ్య లక్ష్మి అని విధాల సహకరించింది. 1829లో నాయుడు మరణించాడు. కొడుకు ఇమ్మడి నాగన్న అప్పటికి అయిదేళ్ళ వాడు. నరసింహుని సోదరుడు వెంకయ్య నాయుడి భార్య వెంకమ్మ వ్యవహారాలూ చూసింది. దీనికి కారణం అతని తల్లి అంతకు ముందే మరణించారు. బొమ్మదేవర ఇమ్మడి నాయుడు కూడా తాత నాగన్న లానే వ్యవహార దక్షుడు. గోదావరి మండలంలోని వసంత వాడ, కొప్పాక, నారాయణ పురం దుద్దే పూడి, ఎస్టేట్లను కొనుగోలు చేసి జమీని విస్తరించారు. కొప్పాకలో వేణు గోపాల స్వామి దేవాలయం కట్టించారు. వసంతవాడలో వేంకటేశ్వరాలయం నిర్మించారు. 1857లో సిపాయి తిరుగు బాటుగా పిలువ బడ్డ మొదటి స్వతంత్ర సంగ్రామం లో చాకచక్యంగా యుద్ధ సామగ్రి చేరా వేశారు .ఆ నాటి బ్రిటిష్ రాణీ రౌద్ర నామ సంవత్సరంలో ”భాసుర స్వర్ణ మయ బాహు పురియు, రమ్య కాశ్మీర పట్టాంబర ద్వయము ”బహుమతి గా అంద జేసినట్లు ”చెన్న పురీ విలాసం”లో వుంది. వేణుగోపాల స్వామికి అయిదు అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మించారు.స్వామికి భూవసతి కల్పించారు.1869 లో పెద్ద కొడుకు బొమ్మదేవర వెంకట నరసింహ నాయుడు రాజు అయాడు .ఇతను బ్రిటిష్ వారికి ఎడ్లను సరఫరా చేసి ”దిల్లీశ్వర ప్రసాద సమాసాధిత రాజ బహద్దర ”మొదలైన బిరుదులు పొందారు. బొమ్మదేవర భాష్యకారులు నాయుడు తదుపరి కాలంలో రాజరికం చేసారు. రాజా బొమ్మదేవర భాష్యకార్లు నాయుడు కుమారుడు రాజా బొమ్మ దేవర జగన్నాథరావు నాయుడు. వాస్తవానికి ద్వారకాతిరుమల సంస్థానాలు వీరివే.1910లో లక్ష రూపాయలకు సూరపనేని వంశీయులకు ద్వారకాతిరుమల ను తాకట్టుపెట్టి విడిపించుకోలేక పోయారు.

సంస్థాన విభజన

1875లో ఏడవ ఎడ్వర్డ్ -ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారత దేశం వచ్చాడు. నాయుడు ఆయనకు నాలుగు జింకలతో లాగే బండీని కానుకగా ఇచ్చాడు. ప్రిన్స్ తో మద్రాస్ గిండీ పార్క్ లో ముచ్చటైన ఆ జ్జింక సవారీ బండిలో సవారి చేశాడట.. ఆ జింకల బండీని ఇంగ్లాండ్ తీసుకొని వెళ్ళాడు యువరాజు. నాయుడికి బంగారు పతకం ప్రదానం చేశాడు. నాయుడు రైతుల నుంచి శిస్తును నగదుగా వసూలు చేశాడు. ఆదాయం బాగా పెరిగింది. తాళాలు, ఇనుప సామాను తయారు చేసే కర్మాగారం నెలకొల్పాడు.. పంగిడి గూడెం నుంచి, ఏలూరు కాలువ మీదుగా, భీమడోలు దాకా స్వంత ఖర్చుతో, ఇనుప దారి నిర్మించి, ప్రయాణం సౌకర్య వంతం చేశాడు. కార్ఖానాలలో రైలు చక్రాలు తయారు చేయించాడు. సంస్థానం సాంకేతికంగా అభివృద్ధి జరగాలి అన్న ముందు చూపున్న వాడు. 1895లో నాయుడి తమ్ముళ్ళు ఎస్టేటులో భాగం కోరారు. వ్యాజ్యాలు నడిచాయి. అయిదు తరాల వరకు అవి భక్తంగా వున్న జమీందారి, ఆరవ తరంలో విభక్తమైంది 1900లో ఉత్తర, దక్షిణ వల్లూరు సంస్థానాలుగా చీలి పోయింది. అన్న నరసింహ నాయుడికి ఉత్తర వల్లూరు, తమ్ముడు భాష్య కార్లు నాయుడికి దక్షిణ వల్లూరు దక్కాయి. బందరు, గూడూరు పరగణాలు దక్షిణ వల్లూరుకు చేరాయి. ఉత్తర వల్లూరుకు రాజధాని పంగిడి గూడెం. దక్షణ వల్లూరుకు వల్లూరు రాజధాని. 1918లో నరసింహ నాయుడు మరణించాడు. కొడుకులు నాగన్న నాయుడు వల్లూరు ప్రభువైనాడు. ఈయన సోదరుడే వెంకట రాయలు నాయుడు. ఇతని కుమారుడు రాజా రామేశ్వర ప్రసాద్ బహాదర్.

మూడవ జమీందార్ అయిన నాగన్న నాయుడు పాలనలో కోటలో ఏనుగులు, చిరుత పులులు, శివంగి, 100 గుర్రాలు ఉండేవి. వాటిని ఉత్స వాలాలో ఊరేగించే వారు. పెద్ద కత్తితో ఒకే ఒక్క వేటుకు పది మేకల్ని చంపి, ప్రజలకు అన్నదానం చేసే వాడు. ఉత్సవాల్లో నాట్యం చేయటానికి అయిదు భోగం మేళాలు వచ్చేవి. తోటలో పెద్ద తొట్టె వుండేది. భోగం వాళ్ళతో అందులో జలక్రీడలాడించి, వినోదించేవాడు. మూడువేల ఎకరాల జమీ ఇది. కోట గోడలపై చిన్న కార్లు తిరిగేవి. అంత విశాలం. మేము మా చిన్న తనం లో కోట గోడ లెక్కి చూసే వాళ్ళం గుర్రాలు, ఏనుగులను చూసి ముచ్చట పడేవాళ్ళం. శివరాత్రికి వెళ్లి ఈ ముచ్చట తీర్చుకొనే వాళ్ళం. అప్పటికే కోట శిధిలమైంది.

దక్షిణ వల్లూరు మొదటి జమీందారు భాష్య కార్లు నాయుడు. 1906లో చనిపోయాడు. 1897లో పుట్టి, 1917లో మరణించిన సత్యనారాయణ వర ప్రసాద్ ఈయన కుమారుడే. కుక్కలను ఎక్కువగా పెంచి, వాటి పెళ్ళిళ్ళు చేసి హడావిడి చేయటం వల్ల ”కక్కల రాజా” అని పిలిచే వారు. మాకు కొంత వినికిడి వల్ల ఆయన గురించి తెలిసింది. అట్టహాసంగా ఆడంబరంగా కుక్కల పెళ్ళిళ్ళు చేసి డబ్బంతా మంచి నీళ్ళులా ఖర్చు చేశాడు. చివరికి తిండి కూడా లేకుండా జీవించాడు. విజయవాడ వీధి అరుగుల మీద పడక శీను. తిండి తిప్పలు లేవు. తాగుడుకు బానిసై పోయాడు. ఎవ్వరు పట్టించుకోలేదు.

దాక్షిణ వల్లూరు మళ్ళీ రెండుగా విడి పోయింది. ఒక భాగానికి ఇనుగంటి వారు, రెండవ దానికి బొమ్మ దేవర వెంకట భాష్య కార్లు జమీందారు లైనారు .1953 తర్వాత ,నరసింహ నాయుడి మరణంతో కోట దిక్కులేనిది పూర్తిగా శిథిలమైంది. కూలి పోయి నామ రూపాలు లేకుండా పోయింది. వారసులు దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసు కొన్నారు. ఒకప్పుడు కళకళ లాడిన తోటల వల్లూరు సంస్థానం ఇప్పుడు వెలవెలబోయింది.

వల్లూరు సంస్థానంలో సాహితీ సేవ

ఇమ్మడి నాగన్న నాయుడు కవి, పండితులను పోషించాడు. జాతీయ కలలను, క్రీడలను ప్రోత్సహించాడు. మల్ల యుద్ధాలు జరిపించాడు. మతాతీత పరిపాలన చేశాడు. మంచి క్రీడాకారుడే గాక వేటకాడుకూడా. చిరుత పులి వేట అంటే మ‌హా ఇష్టం. వావిళ్ళ రామస్వామి శాస్త్రి గారికి పుస్తక ప్రచురణలో ఆర్ధిక సహాయం చేశాడు. ఈ ఆస్థాన విద్వాంసుడు మతుకు మల్లి నరసింహశాస్త్రి. మలయాద్రి నరసింహస్వామి భక్తుడు. 1816 -1873 ప్రాంతం వాడు. నాగన్న గారి ఆస్థాన కవి, పరీక్షాది కారి. శంకరాచార్య పీథ విద్వాంసులతో తర్క, మీమాంస శాస్త్రాలలో వాదం చేసి గెలిచిన వాడు. ఆంద్ర మేఘ సందేశం, ఆంద్ర సిద్ధాంత కౌముది, ఇందుమతీ పరిణయం, చేన్నపురీ విలాసం జ్యోతిశ్శాస్త్ర సంగ్రహం, పుండ్ర నిర్ణయ చంద్రిక, భారత శాస్త్ర సర్వస్వం, వేంకటాచల యాత్రా చరిత్ర, సర్రే కృష్ణ జల క్రీడావిలాస నాటకం, శ్రీ లక్ష్మీ నృసింహ శత సహస్ర నామావళి, సంగీత సార సంగ్రహం వంటి ఎన్నో గ్రంథాలు రాశాడు. విభిన్న ప్రక్రియలలో రచనలు చేసిన విద్వన్ మణి మతుకు మిల్లి నరసింహశాస్త్రిగారు.

నవద్వీప పండితుడు కురుగంటి అయ్యప్ప శాస్త్రులు, పరిమి శివయ్య, ప్రభల సుందర రామ మూర్తిలను పరీక్షించి రాజు గారిచే తర్క శాస్త్ర బహుమతులిప్పించారు మతుకు మిల్లి వారు. మంత్రవాది లక్ష్మీ నారాయణ శాస్త్రి, కొమాండూరి రఘునాథాచార్యులను వ్యాకరణంలో పరీక్ష చేసి రాజుగారితో సన్మానం చేయించారు. ఎల్లే పెద్ది రాఘవ శాస్త్రులు, వంక మామిడి, రామ శాస్త్రులను వేదాంతంలో పరీక్షించి సన్మానించాడు. పండితులను పరీక్షించటంలో దిట్ట అని పించుకొన్నాడు జమీందారు గారికి వీరిమాట వేదవాక్కే.

తిరుపతి కవులు

భాష్య కార్లు నాయుడి పట్టాభిషేకానికి తిరుపతి కవులు వచ్చి, ఘన సన్మానం పొందారు. ”బొమ్మ దేవర సద్వంశ వర్ధనుండు -ఘన గునాధ్యుండు -శ్రీ భాష్య కార నృపతి -పుత్రవతి సతి తన దరి బొలుపు దెలుప -శ్రీ ధవుని గ్రూప పట్టాభిషిక్టుడయ్యె” అని దీవించారు. కుక్కల రాజా సత్యనారాయణ వర ప్రసాద్ కూడా గోపాల స్వామి ఉత్స వాలకు శాస్త్ర చర్చలు, కవితా గోష్టులు, అవధానాలు, నాటక ప్రదర్శనలు, నాత్యోత్సవాలు, సంగీత సభలు నిర్వహించేవాడు. గారిక పార్టి కోటయ గారిని ఆస్థాన గాయకునిగా నియమించాడు. అశ్వ ధాటి రామ మూర్తి, హరి నాగ భూషణం తరచుగా ఈ సంస్థానాన్ని దర్శించి సంగీత కచేరీలు చేసే వారు. ”నాగ భూషణము బాడే నాణె మెసగ ”అని తిరుపతి కవులు మెచ్చారు .చాలా సార్లు రాజా వారి నుంచి నూట పద హార్లు కానుకలు అందుకోన్నట్లు తిరుపతి కవులు రాసుకొన్నారు.

నాటక, మల్లయుద్ధ పోషణ

తోట నరసయ్య అనే మల్ల యుద్ధ యోధున్ని ఆదరించి, ప్రజలకు వ్యాయామ శిక్షణ నిప్పించారు. చైనా పులిపాక, బొద్ద పాడు గ్రామాలలో గ్రంథాలయాలు నెల కోల్పారు. వేణు గోపాలస్వామి వీరి కులదైవం. ఆయన పేర ”సరస గుణజాల -సంగీత సామలోల -తోట్ల వల్లూరి గోపాల తోయ జాక్ష” అనే మకుటంతో శతకం లభించింది. కవి ఎవరో తెలీదు. రాయభట్టు వీర రాఘవ కవి, శ్రీ దాసు శ్రీ రాములు స్వామి వారిపై పదాలు రాశారు .శ్రీ రాములు గారు తన 12వ ఏటఅంటే 1858లో అష్టావధానం చేశి ఇమ్మడి నాగన్న బహద్దర్ నుండి బహుమతి పొందారు .దక్షిణ వల్లూరు నాటక సంఘాలను పోషించాడు .”ఇండియన్ డ్రమటిక్ కంపెనీ” తోట్ల వల్లూరు లో వర్ధిల్లింది. ”రంగ భూషణ” అన్న బిరుదు పొందిన నిడుముక్కల సుబ్బారావును సంస్థానం సముచితంగా సత్కరించింది.

వల్లూరు శివాలయం

ఇక్కడి శివాలయం మహిమాన్విత మైనది. శివలెంక వారి ఆలయం ఇది. ఎన్నో ఎకరాల భూమిని స్వామి వారికి రాసిచ్చారు. ఇక్కడి నదీశ్వరునికి ప్రత్యేక క‌థ ఉంది. రాత్రి పూట చేలల్లో మేస్తుంటే, కాలికి ఇనుప గొలుసులు వేసినట్లు కథ‌నం. శివరాత్రికి వారం రోజులు ఉత్సవాలు నిర్వహిస్తారు. శివరాత్రి నాడు స్వామి కల్యాణాన్ని వైభవంగా శివలెంక వారు చేస్తారు. శివ లెంక బసవయ్య గారు గొప్ప ప్లీడరు విజయవాడలో వుండే వారు. వారు సకుటుంబంగా ఇక్కడకు వచ్చి ఉత్స వాలు జరిపించేవారు. పెద్ద తాటాకు పందిళ్ళు వేసే వారు ఊరందరికీ వారం రోజులూ రెండు పూటలా భోజాలు పెట్టె వారు. రాష్ట్రంలోని ఏరు మోసిన సంగీత విద్వాంసులు, హరి కథ‌కులు, ఉపన్యాసకులు, ఈ కార్యక్ర‌మాల్లో పాల్గొని జన్మ ధన్యమయినట్లు భావించే వారు. వారందరికీ ఉచిత వసతి భోజనం కాఫీ టిఫిన్లు ఏర్పాటు చేసే వారు. శివరాత్రి విందు భోజనాలు ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనటం అదృష్టంగా భావించటం నాకు బాగా తెలుసు. పౌరాణిక నాటకాలు వేయించే వారు. అందరికి అర్హతను బట్టి సత్కారం వుండేది. బసవయ్య గారి వాక్కు వేద వాక్కే. ఇక్కడే మేము మా చిన్న తనంలో శివరాత్రి నాడు అబ్బూరి వరప్రసాద్ వేసిన శ్రీ కృష్ణ రాయ బార నాటకం తెల్లవార్లూ చూశాం. సంగీత విద్వాంసులలో హరి వారు సుసర్లవారు, మృదంగ విద్వాంసుడు రామమూర్తి, హరికధకులలో అమ్ముల, ముడునురి మొదలైన వారు పాల్గొనే వారు. అదొక తిరుణాల లాగా జరిగేది. సాయంత్రం మళ్ళీ అందరికి టిఫిను టీ ఉండేవి. రాత్రి భోజనాలు ఉపవాసం ఉన్న వారికి ఫలహారాలు, చక్కటి నాదస్వరం, వీణా వాదనలు, ఫిడేలు సోలోలు అంతా సందడే సందడి. బుర్రకధకులు కూడా కధ చెప్పే వారు. స్థానం నరసింహారావు, అబ్బూరి, బందా వంటి వారు రావటం అంటే, వారిని రప్పించటం అంటే అదంతా బస వయ్య గారి ప్రతిభే .శివ రాత్రి కి సినీ నటి భాను మతి కూడా వచ్చేది .ఆమె బసవయ్య గారి బంధువే .బసవయ్య గారిని అందరు ”అయ్యా వారు ” అనే వారు. ఈ వారం రోజులు అభిషేకాలు పూజలు గొప్పగా జరిగేవి. పూజారి గారు కూడా శివ లెంక వారే. ఇపటికీ బసవయ్య గారివంశీకుల ఆధ్వర్యం లోనే ఆలయం నడుస్తోంది. ఎకదేక్కడి నుంచో భక్తులు కృష్ణా స్నానానికి వచ్చి స్నానం చేసి ఆలయాలను దర్శించి, ఇక్కడి కార్యక్రమాలను చూసి తరించే వారు. శివరాత్రి నాడు రాత్రికి కల్యాణం జరిపి మర్నాడు స్వామి వార్లను రధం మీద ఊరేగిస్తారు.

-టి.వి.గోవిందరావు

Leave A Reply

Your email address will not be published.