పాక్ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, ముగ్గురు పౌరులు మృతి
పాక్‌పై ప్రతీకారం.. 8 మంది పాక్‌సైనికులు హతం

శ్రీనగర్ :పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం బారాముల్లా జిల్లాలోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడికి దిగింది. శుక్రవారం మూడు చోట్ల కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. పాకిస్థాన్ సైనికులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో BSF ఎస్ఐ రాకేశ్ దోహల్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దోహల్తోపాటు BSF కే చెందిన ఒక కానిస్టేబుల్, నలుగురు సాధారణ పౌరులు మృతిచెందారు. రాకేశ్ దోహల్ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ జిల్లా గంగానగర్‌కు చెందిన వ్యక్తిగా ఆర్మీ వెల్లడించింది. కాగా, భారత్ చేతిలో ఎన్నిసార్లు చావుదెబ్బ తిన్నా పాకిస్థాన్ బుద్ధి మారడంలేదు. నియంత్రణ రేఖ వెంబడి మళ్లీమళ్లీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నది.
8 మంది పాక్ సైనికులు మృతి
పాక్ తూటా దెబ్బకి.. భారత్ అదే రీతిలో సమాధానమిచ్చింది. పాక్ బంకర్లపై భారత సైన్యం తూటాల వర్షం కురిపించింది. భారత జవాన్ల కాల్పుల్లో 8 మంది పాక్ రేంజర్లు హతమయ్యారు. మరికొంత మంది గాయపడ్డారు. అంతకుమందు ఎల్వోసీ వెంబడి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఇద్దరు జవాన్లు, నలుగురు పౌరులు ఉన్నారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరు దేశాల మధ్య కాల్పుల నేపథ్యంలో కశ్మీర సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు వెంబడి బలగాలను మరింత అప్రమత్తం చేశారు.
3,589 సార్లు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
ఈ ఏడాది ఇప్పటి వరకు పాక్ సైన్యం 3,589 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపారు. గత నెలలో పూంచ్ సెక్టార్ వద్ద పాక్ సైన్యం కాల్పుల్లో ఓ జవాన్ అమరుడైన విషయం తెలిసిందే. సెప్టెంబరులోనే అత్యధికంగా 427 సార్లు కాల్పులకు తెగబడ్డారు. గతవారం పూంచ్ జిల్లా షాహపూర్, కిర్నీ, కసబా సెక్టార్లలో పాక్ షెల్లింగులతో కాల్పులు జరిపింది. పాక్ కాల్పులను భారత సైనికులు తిప్పికొట్టారు. కథువా జిల్లా హీరానగర్ సెక్టారులోని సరిహద్దు అవుట్ పోస్టు, సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకొని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురువారం అర్దరాత్రి పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది.