పోస్టులకు అడ్మిన్ బాధ్యుడు కాదు..
వాట్సాప్ గ్రూప్‌లో సభ్యుడి పోస్టులకు తనపై చర్యలు తీసుకోలేం: బాంబే హైకోర్టు

ముంబయి (CLiC2NEWS): వాట్సాప్ గ్రూపులో సభ్యుడు చేసే అభ్యంతరకర పోస్టులకు ఆ గ్రూప్ ను నిర్వహిస్తున్న అడ్మిన్ బాధ్యడు కాదని బాంబే హైకోర్టు తేల్చి చెప్పింది. ఓ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌పై పెట్టిన లైంగిక వేధింపుల కేసును కోర్టు కొట్టేసింది. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లకు సభ్యులను చేర్చడం, తొలగించడం వంటి పరిమిత అధికారాలే ఉంటాయని గుర్తు చేసింది. గ్రూప్‌లో ఇతర సభ్యులు చేసే పోస్టులను నియంత్రించే అధికారం ఉండదని తెలిపింది.
గ్రూపులో కొందు వ్యక్తులు మహిళా సభ్యులను అసభ్య పదజాలంతో దూషించినా వారిని కిశోర్ తరోనే (33) అనే అడ్మిన్ గ్రూపు నుంచి తొలగించలేదని, కనీసం క్షమాపణ కోరలేదని దిగువ కోర్టులో ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అతనిపై ఐపిసి 354, 509, 107 సెక్షన్ల కింద, ఐటి చట్టం 67వ నిబంధన కింద కేసులు నమోదు చేసింది. దాంతో అడ్మిన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్‌లో నేరపూరిత చర్యకు అడ్మిన్ బాధ్యుడా? అనే అంశానికే హైకోర్టు పరిమితమైంది.