బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై నిషేధం

న్యూఢిల్లీ : బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై డిసెంబర్ 31 వరకు నిషేధం విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగులోకి రావడంతో భారత్ అప్రమత్తమైంది. బుధవారం నుండి ఈ నిషేధం అమలులోకి వస్తుందని తెలిపింది. అయితే ఇప్పటివరకు విమానాశ్రయాలకు చేరుకున్న ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. కొత్తరకం కరోనా వైరస్, బ్రిటన్ పరిస్థితులపై కొవిడ్-19 సంయుక్త పర్యవేక్షణ బృందంతో నేడు జరిగిన సమావేశంలో చర్చించినట్లు విమాన మంత్రిత్వ శాఖ తెలిపింది. సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
అలాగే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రివేళ కర్ఫ్యూ విధించింది. ఈ కర్ఫ్యూ వచ్చేనెల 5వ తేదీ వరకు అమలులో ఉంటుందని ప్రకటించింది. ముంబై నగర పాలక సంస్థ పరిధిలో ఈ కర్ఫ్యూ అమలు చేస్తామని తెలిపింది. మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ మొదలవుతుందని వివరించింది.
ఇప్పుడిప్పుడే కోవిడ్ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న ప్రజలకు బ్రిటన్‌లో వెలుగు చూసిన ఓ కొత్త రకం కరోనా వైరస్ మళ్లీ వణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తోంది. దీనివల్ల బ్రిటన్‌లో పరిస్థితి చేయి దాటి పోవడంతో లండన్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు . క్రిస్‌మస్ సంబరాలను సైతం రద్దు చేస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.