భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో రెండు రోజుల క్రితం కలకలం రేపిన ఐసీస్‌ ముఠా నుంచి పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీన చేసుకున్నారు. ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి నుంచి ఢిల్లీ పోలీసులు సుమారు తొమ్మిది కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆత్మాహుతి జాకెట్లు, ఇతర పదార్థాలు ఉన్నాయి. ఈ వివరాలను ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ డిఎస్‌పి పిఎస్‌.కుష్వా ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని బర్లాంపూర్‌కు చెందిన మహ్మద్‌ ముస్తాకిం అలియాస్‌ అబు యూసఫ్‌ ఖాన్‌ను ఢిల్లీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారని చెప్పారు. ఆ సమయంలో నిందితుడికి, పోలీసులకు మధ్య పరస్పరం కాల్పులు కూడా చోటుచేసుకున్నాయని తెలిపారు. అనంతరం నిందితుడు యూసఫ్‌ఖాన్‌ను సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా యుపిలోని అతని ఇంటికి తీసుకెళ్లామని తెలిపారు. అక్కడ తనిఖీలు నిర్వహించామన్నారు. మూడు పాకెట్ల పేలుడు పదార్థాలు అమర్చిన ఒక జాకెట్‌, నాలుగు పాకెట్లు అమర్చిన మరో జాకెట్‌ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇంకా పేలుడు పదార్థాలతో ఉన్న బెల్ట్‌ను కూడా సీజ్‌ చేశామన్నారు. వీటితోపాటు ఎలక్ట్రిసిటీ వైర్ల బాక్స్‌ కలిగివున్న మూడు సిలిండ్రికల్‌ మెటల్‌ బాక్సులు, రెండు ఇతర బాల్‌బేరింగ్‌తో ఉన్న బాక్సులతో పాటు ఒక ఐఎస్‌ఐఎస్‌ జెండాను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
వెంటనే రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృంధం మరికొన్ని ఆధారాలను సేకరిస్తోంది. యూసఫ్‌తో పాటు ఇంకా ఎవరైనా పేలుళ్లకు ప్రయత్నిస్తున్నారా..? ఏయే ప్రాంతాలు వారి టార్గెట్‌లో ఉన్నాయన్న అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. మరోవైపు యూపీలో భారీగా పేలుడు పదర్ధాలు లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీతో సహా దేశంలోని ముఖ్య పట్టణాల సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు. దీనిపై కేంద్ర హోంశాఖ ఆరా తీస్తోంది.

Leave A Reply

Your email address will not be published.