భారత్ బంద్‌లో రైతులందరూ పాల్గొనాలి: మంత్రి కేటీఆర్

ఖమ్మం: ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఖానాపురం మినీ ట్యాంక్‌బండ్‌ను, రఘునాథపాలెం మినీ ట్యాంక్‌బండ్‌ను, బల్లేపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఖమ్మం – ఇల్లెందు రోడ్డు అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. పాండురంగాపురం – కోయచలక క్రాస్ రోడ్‌లో బీటీ రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థకు శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెం – చింతగుర్తి బీటీ రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించారు.
రఘునాథపాలెంలో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. రేపటి భారత్ బంద్‌లో తెలంగాణ రైతులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలన్నారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో రైతులను కార్మికులుగా మార్చే కుట్రను వ్యతిరేకించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ధర్నాలు, ఆందోళనలతో కేంద్రానికి నిరసన తెలపాలి. 67 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఖమ్మం చేసి చూపించామని కేటీఆర్ తెలిపారు. పల్లెల్లో పల్లెప్రగతి ద్వారా, పట్టణాల్లో పట్టణ ప్రగతి ద్వారా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. కార్యక్రమాల్లో మంత్రులు మహముద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.