భ‌ద్రాచ‌లం: వైభ‌వంగా రాములోరి క‌ల్యాణం

భ‌ద్రాచ‌లం: భ‌ద్రాచ‌లంలో సీతారామ‌చంద్ర‌స్వామి క‌ల్యాణ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వేద పండితుల మంత్రోచ్ఛార‌ణల న‌డుమ అభిజిత్ ల‌గ్నంలో క‌ల్యాణ క్ర‌తువును ఘ‌నంగా నిర్వ‌హించారు. స‌రిగ్గా ప‌న్నెండు గంట‌ల‌కు జిల‌క‌ర్ర‌, బెల్లం పెట్టారు. అనంత‌రం మాంగ‌ళ్య‌ధార‌ణ జ‌రిగింది. ఈ క‌మ‌నీయ వేడుక రామ భ‌క్తుల్ని ఆనంద పార‌వ‌శ్యంలో ముంచెత్తింది. రాముడి దోసిట నీలు రాసులు.. సీతాదేవి దోసిట కెంపులు త‌లంబ్రాలుగా మారాయి. రాములోరి క‌ల్యాణానికి ప్ర‌భుత్వం త‌ర‌పున ప‌ట్టు వ‌స్ర్తాలు, ముత్యాల త‌లంబ్రాల‌ను మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, పువ్వాడ అజ‌య్ కుమార్ దంప‌తులు స‌మ‌ర్పించారు. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల భ‌క్త‌జ‌నుల సంద‌డి లేకుండానే క‌ల్యాణ వేడుక‌లను ఘ‌నంగా నిర్వ‌హించారు.

రాములోరి కల్యాణ వేడుక కోసం ఆల‌య ప్రాంగ‌ణాన్ని రంగురంగుల మామిడి తోర‌ణాలు, అర‌టి ఆకుల‌తో శోభాయ‌మానంగా తీర్చిదిద్దారు. నిత్య క‌ల్యాణ మండ‌పం వ‌ద్ద ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసి మండ‌పాన్ని సుంద‌రంగా అలంక‌రించారు. ఇవాళ క‌ల్యాణం ముగియ‌డంతో రేపు శ్రీరామ‌చంద్రుడి ప‌ట్టాభిషేక మ‌హోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. కొవిడ్ కార‌ణంగా పూజ‌లు, తీర్థ ప్ర‌సాదాలు నిలిపివేశారు.

ఈ వేడుక‌ల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య దంపతులు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎస్పీ సునీల్ దత్, జేసీ కర్నాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ బాలసాని, ఎండోమెంట్ కమీషనర్ అనీల్ కుమార్ దంపతులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావుతో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.