ముగిసిన హైడ్రామా.. గాంధీ కుటుంబానికే పార్టీ పగ్గాలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న డ్రామాకు తెరపడింది. కొత్త అధ్యక్ష ఎన్నిక జరిగే వరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగనున్నారు. సోమవారం ఆన్‌‌లైన్‌లో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పు తథ్యంగా కనిపిస్తోందన్న చర్చోపచర్చల నేపథ్యంలో నాటకీయ పరిణామాల మధ్య జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు ఏడు గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం సాగింది. ప్రస్తుతానికి సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని పార్టీ ముఖ్య నేతలంతా సీడబ్ల్యూసీలో తీర్మానించారు. రాబోయే 6 నెలల్లో పార్టీ కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నట్లు తెలిపారు. దీంతో.. నాయకత్వ బాధ్యతల నుంచి సోనియా తప్పుకోనున్నారన్న వార్తలకు తెరపడింది. పార్టీ నాయకత్వం మార్పు కోరుతూ ఇటీవల సోనియాకు లేఖ రాసిన 23 మందిలో మెజార్టీ సభ్యులు సోనియా, గాంధీ కుటుంబం నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. తొలుత మాట్లాడిన సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఆరోగ్యం సహకరించకపోయినా ఏడాదిగా పార్టీ బాధ్యతలు మోస్తున్నానని అన్నారు. పార్టీ నాయకత్వం మార్పును సీనియర్లు కోరుతున్నందున కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభించాలని సీడబ్ల్యూసీని కోరారు. వెన్నంట ఉన్న సీనియర్లు ఇలా బహిరంగ లేఖ రాయడం తనను బాధకు గురి చేసినట్లు సోనియా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తనకు ఎవరిపై ఎలాంటి కోపం లేదన్నారు. పార్టీ కోసం అంతా కలిసి పనిచేద్దామని సోనియా పిలుపునిచ్చారు.

అనంతరం మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సొనియా కొనసాగాలని కోరారు. మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంథోని కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాహుల్‌ వ్యాఖ్యలపై సీనియర్‌ నేతలు కపిల్‌ సిబల్‌, ఆజాద్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిజెపితో సంబంధాలున్నాయ‌ని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధ‌మ‌ని సీనియ‌ర్‌నేత గులాంన‌బీ అజాద్ ప్ర‌క‌టించారు. మ‌రో సీనియ‌ర్‌నేత క‌పిల్ సిబ‌ల్ కూడా ట్విట్ట‌ర్‌లో స్పందించారు. గ‌త 30 యేళ్ల రాజ‌కీయంలో బిజెపికి అనుకూలంగా మాట్లాడలేద‌ని సిబ‌ల్ పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఆవేద‌న వ్యక్తం చేశారు.
ఇన్నాళ్ల‌ తమ కృషికి ఇచ్చే గౌరవం ఇదేనా అని కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. రాహుల్‌ వ్యాఖ్యలతో కపిల్‌ సిబల్‌, ఆజాద్‌ రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ ప్రభుత్వాలు బీజేపీ నుంచి ముప్పును ఎదుర్కొన్న సందర్భాల్లో తాము ముందుండి పరిస్థితి చక్కదిద్దామని రాజస్తాన్‌ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ వారు పేర్కొన్నారు. ఇంత చేసినా తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్‌ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.
ఆ త‌ర్తాత సీడబ్ల్యూసీ భేటీలో తన వ్యాఖ్యలపై నొచ్చుకున్న కపిల్‌ సిబల్‌తో రాహుల్‌ మాట్లాడారు. సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్‌ వివరణ ఇచ్చారు. దీంతో రాహుల్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు సిబల్‌ వెల్లడించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ తాను చేసిన ట్వీట్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు సిబల్ మరో ట్వీట్ చేశారు. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత గులాం నబీ ఆజాద్ కూడా ఇదే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. బీజేపీతో కుమ్మక్కయ్యారన్న వ్యాఖ్యలను రాహుల్ చేయలేదని ఆయన తెలిపారు. దీంతో ఈ వివాదం సద్దుమణిగింది. గాంధీ కుటుంబంపై సభ్యులంతా విశ్వాసం వ్యక్తం చేశారని చెప్పారు. కొత్త అధ్యక్షుడ్ని ఎన్నుకునేందుకు మరో ఆరు నెలల్లో సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.