రాహుల్ గాంధీ వర్సెస్ సీనియర్లు

న్యూఢిల్లీ : అధ్యక్షపదవిపై జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్‌లో వాడీవేడీ చర్చ జరుగుతోంది. పార్టీ ప్రాక్షాలనపై కాంగ్రెస్ పార్టీ సినియర్ల లేఖ తెలిసిందే.. ఈ లేఖను ప్రాస్తావిస్తూ రాహుల్‌గాంధీ సీనియర్లను నిలదీశారు. బిజెపితో కుమ్మక్కై లేఖరాశారా? అని మండిపడ్డారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ పార్టీలో పెను ప్రకంపనలు రేపింది. సీనియర్ నేతల తీరుపై రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో పార్టీ ప్రభుత్వాలు ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నాయకత్వ మార్పుపై సీనియర్లు లేఖ రాయడం సరికాదన్నారు.
నిరూపిస్తే రాజీనామా చేస్తానన్న ఆజాద్
రాహుల్ వ్యాఖ్యలపై సీనియర్ నేతలు కపిల్ సిబల్, ఆజాద్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బిజెపితో సంబంధాలున్నాయని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని సీనియర్‌నేత గులాంనబీ అజాద్ ప్రకటించారు. మరో సీనియర్‌నేత కపిల్ సిబల్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. గత 30 యేళ్ల రాజకీయంలో బిజెపికి అనుకూలంగా మాట్లాడలేదని సిబల్ పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్నాళ్ల తమ కృషికి ఇచ్చే గౌరవం ఇదేనా అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలతో కపిల్ సిబల్, ఆజాద్ రాజీనామాకు సిద్ధపడ్డారు. పార్టీ ప్రభుత్వాలు బీజేపీ నుంచి ముప్పును ఎదుర్కొన్న సందర్భాల్లో తాము ముందుండి పరిస్థితి చక్కదిద్దామని రాజస్తాన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ వారు పేర్కొన్నారు. ఇంత చేసినా తాము బీజేపీతో కుమ్మక్కయ్యామని రాహుల్ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.
తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన యువనేత
సీడబ్ల్యూసీ భేటీలో తన వ్యాఖ్యలపై నొచ్చుకున్న కపిల్ సిబల్‌తో రాహుల్ మాట్లాడారు. సీనియర్లపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ వివరణ ఇచ్చారు. దీంతో రాహుల్‌పై తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు సిబల్ వెల్లడించారు.
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేశారు. సోమవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సోనియా గాంధీ తన నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగలేనని, బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని సీడబ్ల్యూసీ భేటీలో ఆమె స్పష్టం చేశారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు ఆమె సూచించారు.