ఆ నిర్ణ‌యం బాధాక‌రం.. కేంద్రం తీరుపై ఈటల ఆగ్రహం

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రానికి 4 ల‌క్ష‌ల రెమిడెసివిర్ ఇంజ‌క్ష‌న్లు ఆర్డ‌ర్‌పెడితే కేవ‌లం 21,550 మాత్ర‌మే ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్ప‌డం స‌రికాద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. దీనిపై తాము నిర‌స‌న తెలుపుతున్న‌ట్లు చెప్పారు. తాత్కాలిక స‌చివాల‌యం బీఆర్కే భ‌వ‌న్‌లో మీడియాతో ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడారు.

క‌రోనా వ్యాక్సిన్‌లాగే రెమిడెసివిర్ కూడా త‌మ ఆధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణ‌యం తీసుకోవాడం బాధాక‌ర‌మ‌న్నారు. రెమిడెసివ‌ర్ పంపిణీ విష‌యంలో కేంద్రం నిర్ల‌క్ష్యం వ‌హిస్తుంద‌న్నారు. ప‌ది రోజుల్లో గుజ‌రాత్‌కు ఒక ల‌క్షా 63 వేలు, మ‌హారాష్ర్ట‌కు 2 ల‌క్ష‌ల డోసులు, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు 92 వేలు, ఢిల్లీకి 63 వేల డోసుల రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్లు పంపిణీ చేస్తే, తెలంగాణ‌కు 25 వేలపైన‌ డోసులు మాత్ర‌మే ఇచ్చింద‌న్నారు. క‌రోనా కేసులు అధిక‌మ‌వుతున్న నేప‌థ్యంలో రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల కొర‌త రాకుండా చూడాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాల మేర‌కు 2 ల‌క్ష‌ల వ‌య‌ల్స్‌కి ఆర్డ‌ర్ పెట్ట‌డం జ‌రిగింది.

దేశంలో అత్య‌ధిక కేసులు మ‌హారాష్ర్ట‌లో న‌మోదు అవుతున్నాయి. ఏపీ, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ర్ట నుంచి రోగులు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున‌.. రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల‌ను పెంచాల‌న్నారు. రోగులెవ‌రికీ ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూడాల‌ని, 4 ల‌క్ష‌ల రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చామ‌న్నారు. 4 ల‌క్ష‌ల డోసులు వ‌స్తాయ‌ని ఆశిస్తే కేంద్రం పిడుగుపాటు వార్త అందించింది. వాక్సిన్‌ను త‌మ ప‌రిధిలోకి తీసుకున్న‌ట్టే రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల పంపిణీ కూడా త‌మ ప‌రిధిలోనే ఉంటుంద‌ని కేంద్రం తెలిపింది. తెలంగాణ‌కు 21వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వ‌ర‌కు 21,551 వ‌య‌ల్స్‌ను మాత్ర‌మే కేటాయించారు. దీనిపై త‌క్ష‌ణ‌మే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌తో మాట్లాడాను. దీనిపై కేంద్రానికి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నాం అని తెలిపారు.

అలాగే కేంద్రం ఆక్సిజ‌న్ స‌ర‌ఫరా విష‌యంలో దారుణంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. రాష్ట్రంలో రోజుకు 384 ట‌న్నుల ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఉంద‌ని మంత్రి ఈట‌ల తెలిపారు. ఇవాళ్టి వ‌ర‌కు 270 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ వాడ‌కం జ‌రుగుతుంద‌న్నారు. ఒక్క రోగిని కూడా పోగొట్టుకోవ‌ద్ద‌ని, ఇత‌ర రాష్ర్టాల నుంచి ఆక్సిజన్‌ను స‌ర‌ఫ‌రా చేసుకుంటున్నాం. ప‌క్క రాష్ర్టాల నుంచి ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేయాల్సింది పోయి… 1300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ఒడిశా నుంచి ఆక్సిజ‌న్‌ను త‌ర‌లిస్తున్నారు. బ‌ళ్లారి నుంచి 20 ట‌న్నులు, 84 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను ఒడిశా నుంచి ఇచ్చారు. త‌మిళ‌నాడు నుంచి 30 మెట్రిక్ ట‌న్నుల ఆక్సిజ‌న్ కేటాయించారు. త‌మిళ‌నాడు మాత్రం ట‌న్ను కూడా ఇవ్వ‌బోమ‌ని చెబుతోంద‌న్నారు. త‌మిళ‌నాడు త‌ర‌హాలో రెమిడెసివ‌ర్ ఇంజ‌క్ష‌న్ల విష‌యంలో తాము కూడా వ్య‌వ‌హ‌రిస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు.

Leave A Reply

Your email address will not be published.