విమర్శకుల నోళ్లుమూయించాం : రష్యా

మాస్కో : ర‌ష్యా తీసుకొచ్చిన కోవిడ్ 19 వ్యాక్సిన్ `స్పుత్నిక్ వీ`తో శ‌రీరంలో యాంటీబాడీలు ఉత్ప‌త్తి అవుతున్నాయ‌ని ప్రముఖ మెడిక‌ల్ జ‌ర్న‌ల్ లాన్సెట్ వెల్ల‌డించింది. తొలి రెండు ద‌శ‌ల మాన‌వ ప్ర‌యోగాల్లో పాల్గొన్న అంద‌రిలోనూ ఇవి ఉత్ప‌త్తి అయిన‌ట్లు పేర్కొంది. శుక్ర‌వారం విడుద‌లైన ఈ జ‌ర్న‌ల్‌లో ఈ విష‌యం వెల్ల‌డైంది. దీంతో స్పుత్నిక్‌-వీ పనితీరుపై విమర్శకులకు ఈ పరీక్షలో వెల్లడైన అంశాలే సమాధానమని రష్యా వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూన్‌-జులైలో వ్యాక్సిన్‌పై నిర్వహించిన రెండు దశల పరీక్షలో పాల్గొన్న 76 మందిలోనూ కోవిడ్‌-19ను ఎదుర్కొనే యాంటీ బాడీలు అభివృద్ధి చెందాయని, ఏ ఒక్కరిలోనూ తీవ్ర సైడ్‌ఎఫెక్ట్స్‌ కనిపించలేదని లాన్సెట్‌ పేర్కొంది. ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌గా చెబుతున్న ఈ వ్యాక్సిన్‌కు ఆగస్ట్‌లోనే దేశీయ వినియోగానికి రష్యా అనుమతించిన సంగతి తెలిసిందే.

కోవిడ్‌-19 నుంచి రక్షణ కల్పిస్తూ దీర్ఘకాల భద్రత, సమర్ధతల గురించి నిర్ధారణ చేసుకునేందుకు స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై భారీస్ధాయిలో సుదీర్ఘ పరీక్షలు అవసరమని లాన్సెట్‌ పేర్కొంది. కాగా ఈ వ్యాక్సిన్‌ పూర్తిస్దాయిలో పరీక్షలు చేపట్టి, అంతర్జాతీయంగా ఆమోదం లభించే వరకూ స్పుత్నిక్‌ వీని వాడరాదని పలువురు నిపుణులు హెచ్చరించారు. అయితే అంతర్జాతీయ పత్రిక లాన్సెట్‌లో తొలిసారిగా రష్యన్‌ వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు ప్రచురించడం, 40,000 మందిపై గతవారం పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో తమ వ్యాక్సిన్‌పై అనుమానాలు పటాపంచలవుతాయని సీనియర్‌ రష్యన్‌ అధికారి వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివ‌రి నాటికి నెల‌కు 15 ల‌క్ష‌ల నుంచి 29 ల‌క్ష‌ల డోసుల‌ను సిద్ధం చేయ‌గ‌ల‌మ‌ని భావిస్తోంది. క్ర‌మంగా నెల‌కు దాన్ని 60 ల‌క్ష‌ల‌కు పెంచుకోగ‌ల‌మ‌న్న విశ్వాసాన్నిపరిశ్రమల మంత్రి డెనిస్‌ మంతురోవ్‌ వెల్లడించారు

Leave A Reply

Your email address will not be published.