శుభ‌వార్త‌: భార‌త్‌లో స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు అనుమ‌తి

న్యూఢిల్లీ: భార‌త్‌లో మ‌రో వ్యాక్సిన్ వినియోగానికి అనుమ‌తి ల‌భించింది. రోజు రోజుకి క‌రోనా కేసులు పెరుగుతుండ‌టం, వివిధ రాష్ట్రాల్లో వాక్సిన్ కొర‌త ఉండ‌టంతో మ‌రో ఐదు వ్యాక్సిన్ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వి క‌రోనా వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి ఎక్స్‌ప‌ర్ట్ క‌మిటీ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో ఇండియాలో ఆమోదం పొందిన మూడో క‌రోనా వ్యాక్సిన్‌గా స్పుత్నిక్ వి నిలిచింది. ఇప్ప‌టికే భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన‌ కొవాగ్జిన్‌, సీర‌మ్ త‌యారుచేస్తున్న కొవిషీల్డ్‌ను వినియోగిస్తున్న విష‌యం తెలిసిందే.

ర‌ష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్ అభివృద్ధి చేసిన ఈ టీకాను భార‌త్‌లో ఉత్ప‌త్తి చేసి విక్ర‌యించేదుకు డాక్ట‌ర్ రెడ్డీస్ లేబోరేట‌రీస్ ఒప్ప‌టందం కుదుర్చుకున్న విష‌యం తెలిసిందే. దీంతో సోమ‌వారం డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నిపుణుల క‌మిటీ దీనిపై చ‌ర్చించ‌డానికి స‌మావేశ‌మైంది. ఆ వెంట‌నే వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి నిపుణుల క‌మిటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఈ వ్యాక్సిన్‌ను ఇండియాలో హైద‌రాబాద్‌కు చెందిన‌ డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్‌ త‌యారు చేస్తోంది. ర‌ష్యాకు చెందిన గ‌మ‌లేయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ ఎపిడ‌మాల‌జీ అండ్ మైక్రోబ‌యోల‌జీ దీనిని అభివృద్ధి చేసింది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సామ‌ర్థ్యం 91.6 శాతంగా ఉన్న‌ట్లు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో తేలింది.

స్పుత్నిక్ వి టీకాపై మ‌న దేశంలో రెండు, మూడో ద‌శ క్లినిక‌ల్ ప‌రీక్ష‌ల‌ను ఇటీవ‌లే ఆ సంస్థ నిర్వ‌హించింది. ఆ ప‌రీక్ష‌ల భ‌ద్ర‌త‌, ఇబ్యూనోజెనిసిటీ స‌మాచారాన్ని ఇప్ప‌టికే భార‌త ఔష‌ధ నియంత్ర‌ణ మండ‌లికి అంద‌జేసిన డాక్ట‌ర్ రెడ్డీస్.. టీకా ఉత్ప‌త్తి, అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తులు మంజూరు చేయాలంటూ ద‌ర‌ఖాస్తు చేసుకుంది. సోమ‌వారం ఈ డేటాను కేంద్ర నిపుణుల బృందం విశ్లేషించి, అత్య‌వ‌స‌ర వినియోగానికి సిఫార‌సు చేసింది.

Leave A Reply

Your email address will not be published.