హైదరాబాద్ గులాబీలు కావాలా? గుజరాత్ గులాములు కావాలా?
రోడ్‌షోలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్: గత ఐదేండ్లలో ఏం చేసినమో చెప్పే బాధ్యత మాపై ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. చైతన్యపురి డివిజన్‌లో రూ.150 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిపై ప్రగతి నివేదికను విడుదల చేశానని తెలిపారు. సోమవారం ఆయన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్‌నగర్, ఎల్బీనగర్ డివిజన్లలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో మంచినీటి సమస్యను పరిష్కరించామని, టీఆర్ఎస్ పాలనలో బస్తీలు అభివృద్ధి చెందాయని ఆయన పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్ ప్రశాంతమైన నాయకత్వంలో ఉంది. యాపిల్, అమెజాన్, గూగుల్ వంటి సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌లో కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం.
దేశంలో చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నది ఢిల్లీ తర్వాత హైదరాబాదే. పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడింది. అన్నపూర్ణ క్యాంటీన్ పేదవారి ఆకలి తీర్చింది. వరద సాయంపై కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాస్తే స్పందించలేదు. హైదరాబాద్‌కు కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదని’’ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ గులాబీలు కావాలా? గుజరాత్ గులాములు కావాలా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఆరేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసింది సున్నా. తెలంగాణ నుంచి కేంద్రం రూపాయి తీసుకుంటే.. మనకు వెనక్కు వస్తోంది అర్ధ రూపాయేనని దుయ్యబట్టారు.
ఆరేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసింది సున్నా..
గత ఐదేండ్లలో ఏం చేసినమో చెప్పే బాధ్యత మాపై ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీ &టీ కాలనీలో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు.
‘గండిపేటకు రెట్టింపు స్థాయిలో కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాం. 2050 వరకు హైదరాబాద్‌కు మంచినీటి కష్టాలు ఉండవు. హైదరాబాద్‌లో 5 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ ఆరేళ్లలో బీజేపీ హైదరాబాద్‌కు ఒక్కపైసా ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతు పలకాలి. టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం. వరద సమయంలో మేం అండగా ఉన్నాం. ఆరున్నర లక్షల మందికి రూ.650 కోట్ల వరద సాయం చేశాం. టీఆర్‌ఎస్ పేదల పక్షపాత ప్రభుత్వం.’ అని కేటీఆర్ పేర్కొన్నారు.