అమెరికా మాజీ అధ్యక్షుల పింఛన్ ఎంతో తెలుసా!

వాషింగ్టన్: పెద్దన్న పాత్ర పోషించే అమెరికాకు అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని చవి చూశారు. ఇదిలా ఉంటే పదవీకాలం ముగిసిన తర్వాత మాజీ అధ్యక్షులు ఎలా జీవిస్తారు.? వారికి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రయోజనాలు చేకూరుతాయా.? అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..
దేశానికీ ఎంతగానో సేవలందించి పదవీకాలం ముగిసిన మాజీ అధ్యక్షులకు ప్రభుత్వం చాలానే ప్రయోజనాలు అందిస్తుంది. అమెరికాకు ఇప్పటి వరకు 45 మంది అధ్యక్షులయ్యారు. చరిత్ర చూస్తే చాలా మంది నేతలు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే పదవీ కాలం ముగిసిన తర్వాత వారుం ఏం చేస్తారు? ఎలా జీవిస్తారు? అనే విషయాన్ని ఎవరూ పట్టించుకోరు. అయితే దేశానికి సేవలందించినందుకు గాను వీరికి ప్రభుత్వం కొన్ని ప్రయోజనాలు కల్పిస్తుంది. వీటి విధివిధానాల కోసం 1958లో ‘ఫార్మర్ ప్రెసిడెంట్ యాక్ట్’ అమలులోకి వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం మాజీ అధ్యక్షులకు ప్రభుత్వ పింఛన్, సిబ్బంది జీతభత్యాల భృతి, ఆరోగ్య బీమాతో పాటు రహస్య భద్రతను కల్పిస్తుంది.
మాజీ అధ్యక్షులకు ప్రతీ ఏటా రూ. 1.6 కోట్లు (2,19,200 డాలర్లు) పింఛన్ కింద సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ మంజూరు చేస్తుంది. అంతేకాదు మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి 20 వేల డాలర్ల పింఛన్ అందజేస్తారు. అలాగే శ్వేతసౌధాన్ని విడిచిపెట్టిన తర్వాత మాజీ అధ్యక్షుడు సొంతంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే ఖర్చును కూడా అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. మాజీ అధ్యక్షుడి కొత్త ఆఫీసు అద్దె, టెలీఫోన్, ఇంటర్నెట్, ప్రింటింగ్, పోస్టల్ సేవలకు అయ్యే ఖర్చుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయింది.
ఇంకా వారి వ్యక్తిగత ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను సైతం ప్రభుత్వం జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఇప్పిస్తుంది. ఆ ఉద్యోగుల జీతాలు మొదటి 30 నెలలు 1.5 లక్షల డాలర్లు మించకూడదు, ఆ తర్వాత 96 వేల డాలర్లకు పరిమితం చేస్తారు.
అలాగే మాజీ అధ్యక్షులకు ఆరోగ్య భీమాతో పాటు రహస్య భద్రతను కూడా ఏర్పాటు చేస్తుంది. మాజీ అధ్యక్షుడితోపాటు ఆయన కుటుంభ సభ్యులకు రహస్యంగా భద్రత కల్పిస్తోంది. 1965 నుంచి 1996 వరకు జీవితకాలం భద్రత కల్పించే చట్టం అమలులో ఉండేది. 1997లో దానిని పదేళ్లకు కుదించారు. అయితే బరాక్ ఒబామా మళ్లీ దాన్ని జీవిత కాలం పెంచుతూ చట్టం తీసుకొచ్చారు. ఏది ఏమైనా అధ్యక్ష పీఠం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మాజీ అధ్యక్షుల జీవితం బిందాస్ అని చెప్పాలి.
– యెట్టయ్య గడ్డగూటి