ఆక్సిజన్, వ్యాక్సిన్ టీకాల‌ దిగుమ‌తిపై కస్టమ్స్ డ్యూటీ మాఫీ

మోడీ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో రెండో ద‌శ కొవిడ్ ఉధృతి తీవ్ర‌మ‌వుతున్న వేళ వైద్య ప‌రంగా ప్ర‌జ‌ల‌పై ప‌డుతోన్న భార‌న్ని త‌గ్గించేందుకు కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కొవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సిజ‌న్ దిగుమ‌తిపై కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సెస్‌ను మూడు నెలల కాలానికి తక్షణమే మాఫీ చేస్తున్న‌ట్లు శ‌నివారం కేంద్రం ప్ర‌క‌టించింది. దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి, ఆక్సిజ‌న్ అందుబాటుపై మధ్యాహ్నం ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి స‌మీక్షా సమావేశం అనంత‌రం ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.స‌

తాజా నిర్ణ‌యం వ‌స్తుల ల‌భ్య‌త‌ను పెంచ‌డ‌మే కాక చౌక‌గా ల‌భించేలా చేస్తుంద‌ని ప్ర‌భుత్వం పేర్కొంది. అలాగే వాటికి త్వ‌ర‌గా కస్ట‌మ్స్ అనుమ‌తులు వ‌చ్చేలా చూడాల‌ని ప్ర‌ధాని రెవెన్యూ అధికారుల‌ను ఆదేశించారు. దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు తీసుకున్న చర్యలను ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా సమీక్షించారు. మెడిక‌ల్ ఆక్సిజ‌న్‌, ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప‌రిక‌రాలు, క్రిటిక‌ల్ కేర్ యూనిట్లో రోగుల‌కు ఉప‌యోగించే ప‌రిక‌రాల దిగుమ‌తిపై సుంకాన్ని ఎత్తేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించారు.

స‌ర్కార్ పేర్కొన్న జాబితాలో.. ఆక్సిజ‌న్‌, ఆక్సిజ‌న్ క్యానిస్ట‌ర్‌, ఫిల్లింగ్ సిస్ట‌మ్స్‌, కంటైన‌ర్లు, ట్రాన్స్‌ఫోర్ట్ ట్యాంకులు, ఆక్సిజ‌న్ జ‌న‌రేట‌ర్లు, వెంటిలేట‌ర్లు ఉన్నాయి. వాటితో పాటు కొవిడ్ టీకాల దిగుమ‌తిపై కూడా క‌స్ట‌మ్ డ్యూటీని మూడు నెల‌ల కాలానికి మాఫీ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Leave A Reply

Your email address will not be published.