ఆక్సిజన్ పంపిణీకి 12 మంది సభ్యుల టాస్క్‌ఫోర్స్: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కు భారీ డిమాండ్‌నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాణవాయువు లభ్యత, సరఫరా, పంపిణీని పర్యవేక్షించేందుకు 12 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక జాతీయ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శాస్త్రీయంగా, హేతుబద్ధంగా, సమానంగా ఆక్సిజన్ అందేలా చూడటం ఈ టాస్క్‌ఫోర్స్ బాధత్య. కొవిడ్ చికిత్సకు అవసరమైన మందుల విషయంలోనూ ఈ టాస్క్‌ఫోర్స్ అదే పని చేయనుంది. వివిధ రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న ఆక్సిజన్ కేటాయింపులను పునఃసమీక్షించాలని చెబుతూ అత్యున్నత న్యాయస్థానం ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
అంబులెన్సులు, కొవిడ్ కేర్ సదుపాయాలు తగినన్ని లేకపోవడం, హోమ్ క్వారంటైన్‌లో ఉన్న పేషెంట్లను పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్రం విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ఈ టాస్క్‌ఫోర్స్‌కు వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మాజీ వీసీ డాక్టర్ భబతోష్ బిశ్వాస్ నేతృత్వం వహించనున్నారు. గురుగ్రామ్ మేదాంత హాస్పిటల్ అండ్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఎండి డాక్టర్ నరేశ్ ట్రెహాన్, ఢిల్లీలోని గంగారమ్, తమిళనాడు రాయవెళ్లూర్ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, బెంగళూరులోని నారాయణ హెల్త్‌కేర్, ముంబయిలోని ఫోర్టిస్ ఆసుపత్రుల్లోని ప్రముఖ వైద్యులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉండనున్నారు.