`ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` ఘనంగా నిర్వహిస్తాం: సిఎం కెసిఆర్

హైదరాబాద్: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏండ్లు పూర్తి కాబోతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరిట, దేశవ్యాప్తంగా జరుపనున్న ఉత్సవాలను, తెలంగాణలో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. నాటి భారత స్వాతంత్ర్య సంగ్రామం జరుగుతున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతం పోషించిన పాత్ర ప్రత్యేకమైనదని సీఎం అన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా స్వయం పాలనలో అభివృద్ది పథంలో దూసుకు పోతున్నదని, దేశ అభ్యుదయంలో తెలంగాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రస్థుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా స్వయం పాలనలో అభివృద్ది పథంలో దూసుకు పోతున్నదని, దేశ అభ్యుదయంలో తెలంగాణది ఉజ్వలమైన భాగస్వామ్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 12 మార్చి 2021 నుండి 2022 ఆగస్టు 15 వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్టు సిఎం తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు కె.వి . రమణాచారి వ్యవహరిస్తారని, సభ్యులుగా సాధారణ పరిపాలన శాఖ, ఆర్ధిక శాఖ, సాంస్క్రతిక వ్యవహారాల శాఖ, మున్సిపల్ శాఖ, పంచాయితీ రాజ్ శాఖ, విద్యాశాఖలకు చెందిన కార్యదర్శులు, డైరక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, కమిషనర్ పంచాయితీ రాజ్, సభ్య కార్యదర్శిగా సాంస్క్రతిక శాఖ డైరక్టర్ లు ఉంటారని సీఎం తెలిపారు. ఈమేరకు ఉత్తర్వులు జారీచేయాలని ముఖ్యమంత్రి సీఎస్‌ను ఆదేశించారు.
`ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` కార్యక్రమ నిర్వహణ విధి విధానాల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉత్సవాల నిర్వహణ పై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్ , సాంస్క్రతిక శాఖ, కార్యదర్శి శ్రీనివాస్ రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదిరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఆజాదీకా అమృత్ మహోత్సవాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను విధి విధానాలను లక్ష్యాలను ప్రధాని వివరించారు.