ఆదిలాబాద్:ఘనంగా ప్రారంభమైన 75 ఏళ్ల స్వాతంత్ర్య అమృతోత్సవాలు..

ఆదిలాబాద్: ఎందరో త్యాగధనుల ఆత్మ సమర్పణతో సాధించుకున్న స్వాతంత్ర్యన్ని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ అన్నారు. 2022 ఆగస్టు 15 నాటికి దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఫ్రీడం రన్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్ జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి ఫ్రీడం రన్ ను ప్రారంభించారు. పట్టణ ప్రధాన విధుల మీదుగా సాగిన ఫ్రీడం రన్ లో జిల్లా అధికారులు, యువజనులు, క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, సాధకులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 75 వారాల పాటు చేపట్టే కార్యక్రమంలో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఫ్రీడమ్ రన్ నిర్వహించామన్నారు. దేశ భక్తిని పెంపొందించే ఈ 75 ఏళ్ల స్వాతంత్ర్య అమృతోత్సవాల ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, అదనపు ఎస్పీ వినోద్ కుమార్, డీఈవో డా. రవీందర్ రెడ్డి, జిల్లా యువజనశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.