ఆది, సోమవారల్లో ఎండమంట!

హైదరాబాద్: ఏప్రిల్ మొదటి వారంలో భానుడు భగభగమండుతున్నాడు. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఎండవేడితో పన్నెండు దాటిందంటే చాలు జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. ఏప్రిల్‌లోనే ఇలా ఉంటే మే నెలలో ఎలా ఉంటాయోనని జనం భయాందోళనలకు గురవుతున్నారు.
రాష్ట్రంలో శనివారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం 43.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయినట్లు టీఎస్‌డీపీఎస్ తెలిపింది. తాజాగా వాతావరణ శాఖ అధికారుల సూచన మేరకు ఆదివారం, సోమవారాల్లో ఎండలు దంచి కొట్టనున్నాయి. ఈ రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల మేర పెరిగే అవకాశః ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణ పేట తదితర జిల్లాల్లో ఆదివారం వడగాల్పలు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎండలతో మండిపోతున్నాయి. కాగా ఇవాళ రేపు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.