ఆయిల్ పామ్ విస్తీర్ణం 8 లక్షల ఎకరాలకు పెరగాలి: సీఎం కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ విస్తరణపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ ఫామ్ విస్తీర్ణంపై అధికారులతో సమీక్షించారు. రూ.4,800 కోట్లతో రాష్ట్రంలో చేపట్టే ఆయిల్ పామ్ విస్తరణ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్రంలో ఆయిల్ పామ్ విస్తీర్ణం 8 లక్షలకు పెరగాలి. రైతులకు 50 శాతం రాయితీతో ఆయిల్ పామ్ సాగు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. నిత్యం నీటి వసతి కలిగిన ప్రాంతాల్లోనే ఆయిల్ పామ్ సాగు సాధ్యమన్నారు. ఆయిల్ ఫామ్ సాగును రైతాంగం ఉపయోగించుకోవాలని సూచించారు.
రాష్ట్రంలోని 25 జిల్లాలను ఆయిల్ పామ్ సాగుకు అనువైనవిగా నేషనల్ రీ అసెస్మెంట్ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిందని వెల్లడించారు. ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంచే విధానంపై ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఒక ఎకరం వరిని సాగు చేయగలిగే నీటితో 4 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చన్నారు. దేశంలో, ప్రపంచంలో ప్రస్తుతం వరి ధాన్యం నిల్వలు అసవరానికి మించి ఉన్నాయి. కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు చేయడం మేలని సూచించారు.
భారతదేశానికి 22 మిలియన్ టన్నుల ఆయిల్ కావాలి కానీ, దేశంలో 7 మిలియన్ టన్నుల ఆయిల్ తీయడానికి అవసరమయ్యే నూనె గింజలు మాత్రమే పండిస్తున్నాం. దీంతో, ప్రతీ ఏడాది 15 మిలియన్ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల ప్రతీ ఏడాది 70 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తున్నది. దిగుమతి చేసుకోవడం వల్ల ఆయిల్ కల్తీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 8 లక్షల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు అవుతున్నది. ఇంకా లక్షలాది ఎకరాల్లో విస్తరించాల్సిన అవసరం, అవకాశం ఉందన్న సీఎం. వరితో పోలిస్తే తక్కువ నీరే అవసరం అయినప్పటికీ, ఆయిల్ పామ్ కు ప్రతీ రోజు నీటి తడి అందించాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి సౌకర్యం పెరగడంతో పాటు, నిరంతర విద్యుత్ సరఫరా ఉంది. ఇవి సానుకూలంగా ఉండడం వల్లే కేంద్ర ప్రభుత్వ సంస్థలు తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ సాగు చేయడానికి అనువైనదిగా గుర్తించాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కేవలం 38 వేల ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు అవుతున్నది. నిర్మల్, మహబూబాబాద్, కామారెడ్డి, వరంగల్ రూరల్, నిజామాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్, సూర్యాపేట, ములుగు, నల్గొండ, జనగామ, వరంగల్ అర్బన్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, సిరిసిల్ల, గద్వాల, మహబూబ్ నగర్, కొత్తగూడెం జిల్లాల్లో 8,14,270 ఎకరాల్లో ఆయల్ పామ్ సాగు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.
పత్తిసాగులో కూడా అనేక కొత్త పద్దతులు వచ్చాయి. కొత్త వంగడాలు కూడా వచ్చాయి. ఒకేసారి పంట వచ్చే విత్తనాలు వస్తున్నాయి. వాటిని తెలంగాణలో పండించాలి. రైతులు రాష్ట్రంలో లాభసాటి పంటలు పండించేలా చర్యలు ప్రారంభించినం. రైతులు ప్రభుత్వ సూచనలు పాటించి నియంత్రిత పద్దతిలో సాగుచేస్తున్నారు. మార్కెట్ లో నూనెగింజలు, పత్తి, పప్పులకు మంచి డిమాండ్ ఉంది. కూరగాయలకు కూడా మంచి ధర వస్తుంది. కందుల విస్తీర్ణం 20 లక్షలకు పెంచాలి. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.