ఆస్కార్ నామినేషన్‌కు ఎంపికైన `జల్లికట్టు`

న్యూఢిల్లీ :అస్కార్స్ -2021 ఎంట్రీస్ లో మలయాళ సూపర్ హిట్ చిత్రం జల్లికట్టు చోటు సంపాదించింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో 93వ అకాడమీ అవార్డ్స్ లో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న చిత్రంగా ‘జల్లికట్టు’ నిలిచింది. ఈ సినిమాను ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. లిజో జోస్ పెల్లిసరీ దర్శకత్వం వహించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్, బుసాన్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించారు. ఒక చిన్న గ్రామంలో కొందరు వ్యక్తులు ఎద్దును ఎదిరించేందుకు యత్నిస్తుంటారు. నియంత్రణ కోల్పోయిన వ్యక్తి ఆ ఎద్దును వధించడం.. జంతు వధను నిషేధించాలనే కధాంశంతో ఈ సినిమాను చిత్రీకరించారు. జల్లికట్టుతో పాటు మరో 27 సినిమాలు ఆస్కార్ ఎంట్రీకి నామినేట్ అయ్యాయి. చప్పాక్, డిసిపల్, శకుంతలా దేవి, చలాంగ్, గులాబో సితాబో, ద స్కై ఈజ్ పింక్, ఈబ్ అల్లే ఓహ్ లు ఈ జాబితాలో ఉన్నాయి. ‘జల్లికట్టు’ సినిమా మనుషులలో ఉన్న కసాయితనాన్ని అందరికీ తెలిసేలా చేసిందని, అంటే మనం జంతువుల కన్నా అధ్వాన్నంగా ఉన్నామని ఫిల్మ్ ఫెడరేషన్ ఇండియా జ్యూరీ చైర్మన్, చిత్ర నిర్మాత రాహుల్ రావిల్ అన్నారు. 2019 సెప్టెంబర్ 6న టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో జల్లికట్టును ప్రదర్శించగా..అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.