ఇక జిల్లా ప‌రిష‌త్‌, మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు నిధులు: సిఎం కెసిఆర్‌

హైదరాబాద్‌ : గ్రామ పంచాయతీలకు ఇస్తున్న మాదిరిగానే జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకూ నిధులు ఇస్తామని ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర‌రావు వెల్ల‌డించారు. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సిఎం కెసిఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. స్థానిక స్వపరిపాలన సంస్థలను మరింత బలోపేతం చేసి, గ్రామీణాభివృద్ధిలో వాటి పాత్రను క్రియాశీలం చేస్తామని సిఎం ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. 2021-22 బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ పలు అంశాలపై మాట్లాడారు..

‘స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగాపంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఆర్థిక సంఘం నిధులను నేరుగా మంజూరు చేస్తున్నది. పంచాయతీలకు నెలకు రూ.308 కోట్ల, మున్సిపాలిటీలకు రూ.148 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నాం. ఈ నిధులతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ట్రాక్టర్లు, డంపుయార్డులు, నర్సరీలు, వైకుంఠధామాలు నిర్మించాం. ఇదే తరహాలో జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్ లకు సైతం ప్రత్యేక ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తాం. ఈ నిధులను నరేగా లాంటి పథకాలతో అనుసంధానం చేసుకోవడం వల్ల మరిన్ని నిధులు సమకూరే అవకాశం ఉంది. నిధులతోపాటు జడ్పీలకు, మండల పరిషత్‌లకు నిర్దిష్టమైన విధులు అప్పగించాలి. ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో అధికారులు సూచించాలి. ఆ సూచనలపై జిల్లా పరిషత్ చైర్‌పర్సన్లతో నేనే స్వయంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటా’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ స‌మావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, కమిషనర్ రఘునందన్ రావు, డిప్యూటీ కమిషనర్ రామారావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రభుత్వ విప్‌లు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, గుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, శంకర్ నాయక్, హర్షవర్థన్ రెడ్డి, ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.