ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఘనుడు రాజీవ్ గాంధీ

కామన ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్థంతి..

మండపేట (CLiC2NEWS): భారత రత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా ఏఐసీసీ సభ్యులు మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి కామన ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏడిద లో శుక్రవారం రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కొడవల్ల వెంకటరమణ సుబ్బారావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ యువజన కాంగ్రెస్ నాయకుడు అప్పురబోతు దుర్గాప్రసాద్ రాజీవ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కోవిడ్ నిబంధనలు అనుసరించి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కామన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ విప్లవాత్మకమైన మార్పులు చేపట్టి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అభివృద్ధి చేశారని అన్నారు. నేడు ప్రతి పౌరుడు చేతిలో ఉన్న సెల్ ఫోన్ వచ్చిందంటే రాజీవ్ గాంధీ ఘనతేనని పేర్కొన్నారు. ఢిల్లీ నుండి గల్లీ వరకూజనాభా ప్రాతిపదికన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఘనత కూడా రాజీవ్ దే అన్నారు. ఈ రోజు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులందరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదే అని కొనియాడారు. ఈ దేశ సమైక్యత, సమగ్రత కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆలోచనలను అమలు చేయాలంటే రాబోయే రోజుల్లో కేంద్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏర్పడితే తప్పఎవరూ చేయలేరని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఒక పక్క కరోనాతో దేశం అట్టుడికి పోతుంటే బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఈ పాటికి ప్రతి పౌరునికి కరోనా వ్యాక్సిన్ ఇంటింటికి వేసి కరోనాను దేశము నుండి పారద్రోలే వారమని పేర్కొన్నారు.1977లో ఈ దేశంలో మసూచికం అనే వ్యాధి ఉంటే ఇందిరా గాంధీ పూర్తిగా నిర్మూలించింది అన్నారు. 2014 నాటికి ఈ దేశంలో పసి పిల్లలు పోలియో తో బాధపడుతూ ఉంటే దాన్ని అరికట్టిన ఘనత అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని తెలియజేశారు. కాబట్టి ఈ దేశ ప్రజల క్షేమం కోరే పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ ను మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చిన నాడే రాజీవ్ గాంధీ కి మనం ఇచ్చే ఘనమైన నివాళి అని ఈ సందర్భంగా కామన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.