ఇళ్లలోనే ఉండటం సేఫ్: గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో సాధ్యమైనంత వరకు ఇండ్లలోనే ఉండటం సురక్షితం అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప ఆస్పత్రులకు వెళ్లకూడదని సూచించారు. కరోనా వ్యాప్తిని ఆపడం ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఆస్పత్రుల్లోనూ వైరస్ అంటుకునే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించే పరిస్థితులు లేవు. ఎవరికి వాళ్లే సెల్ఫ్ లాక్‌డౌన్ విధించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గాంధీ ఆస్పత్రిలో నిన్న ఒక్కరోజే 150 మంది కొవిడ్ రోగులను చేర్చుకున్నామని తెలిపారు. ప్రస్తుతం గాంధీలో ఐసీయూ సామర్థ్యం 350 పడకలే అని చెప్పారు. నిన్న వచ్చిన కరోనా కేసులన్నీ ఐసీయూ అవసరమైనవే అని స్పష్టం చేశారు. రాత్రంతా శ్రమించి ఐసీయూ పడకలు సర్దుబాటు చేశామన్నారు.