ఉమ్మడి కమిటీతో అభ్యర్థి ఎంపిక: పవన్

న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ ముగిసింది. అనంతరం డిల్లీలో పవన్ మీడియాతో మాట్లాడారు. నడ్డాతో భేటీలో అమరావతి, పోలవరం అంశాలపై చర్చించినట్లు చెప్పారు. జేపీ నడ్డా ఆహ్వానం మేరకే ఢిల్లీ వచ్చామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇరు పార్టీల మధ్య సమన్వయ అంశాలపై చర్చించామని తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి నిలబెట్టే అంశంపై ప్రత్యేక చర్చ జరిగిందని అన్నారు. అభ్యర్థి ఎవరు అనేది త్వరలో నిర్ణయిస్తామన్న ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే అంశంపై బిజేపి, జనసేన కట్టుబడి ఉన్నాయని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రదేశ్ ప్రజల శ్రేయస్సు కోసమే కాని పార్టీలకు లబ్ధి చేకూర్చడానికి కాదని నడ్డా చెప్పారని అమరావతిలో చివరి రైతు వరకూ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని అన్నారు. రైతుకు న్యాయం జరగడం అంటే అమరావతి రాజధాని గా కొనసాగాలని అన్నారు. జనవరిలో బీజేపీ చేసిన తీర్మానంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల పై జరుగుతున్న దాడుల పై చర్చించాం. దేవాలయాల పరిరక్షణ కోసం కార్యాచరణ చేపడుతున్నామని అన్నారు.